మామిడి రైతులకు న్యాయం చేయండి : సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు

చిత్తూరు : మామిడి రైతులకు న్యాయం చేయాలంటూ … సోమవారం ఉదయం కలెక్టరేట్‌ లో జరిగిన ప్రజా దర్బార్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నేత మాట్లాడుతూ … జిల్లాలో మామిడి పంట విస్తారంగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం దిగుబడి నామమాత్రంగానే ఉందన్నారు. దిగుబడి తక్కువగా ఉండడంతో ధరలు ఎక్కువగా ఉంటాయని రైతులు ఆశించారని చెప్పారు. వ్యాపారస్తులు, పరిశ్రమ యాజమాన్యాలు వైఖరుల వలన రైతుల ఆశలు అడియాశలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులు కలెక్టర్‌ ను వేడుకోగా గత కలెక్టర్‌ స్పందించి యాజమాన్యాలతో వ్యాపారస్తులతో సమావేశం జరిపి తోతాపూరి పంటకు టన్ను కు రూ.30,000 నిర్ణయించారని తెలిపారు. ఈ ధర కూడా అంతంత మాత్రమే అయినప్పటికీ రైతులు పంటను తీసుకెళితే కలెక్టర్‌ తన నిర్ణయాన్ని తుంగలోతొక్కి రోజురోజుకు తగ్గిస్తూ ప్రస్తుతం 23 వేల రూపాయలకే ధర ఇవ్వడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారని వివరించారు. రైతుల మామిడి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కలెక్టర్‌ ఆదేశాలను అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వినతికి నూతనంగా వచ్చిన కలెక్టర్‌ స్పందిస్తూ …. మరొకసారి సమావేశం జరిపి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

➡️