‘రామాయణంలో అనేక వైజ్ఞానిక అంశాలను తెలుసుకోవాలి

'రామాయణంలో అనేక వైజ్ఞానిక అంశాలను తెలుసుకోవాలి

‘రామాయణంలో అనేక వైజ్ఞానిక అంశాలను తెలుసుకోవాలి’ప్రజాశక్తి – క్యాంపస్‌ జాతీయ సంస్కత విద్యాలయం తిరుపతిలోని చెలికాని అన్నారావు సభాభవనంలో ”శ్రీమద్రామాయణంలో భారతీయ జ్ఞానపరంపర” అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును జ్యోతిప్రజ్వాలనం చేసి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా నేపాల్‌ లోని, ఖాట్మాండులోని నేపాల్‌ సంస్కత విశ్వవిద్యాలయం, వాల్మీకి విద్యాపీఠం ప్రాధ్యాపకులు పద్మప్రసాద భట్టరాయి విచ్చేసి శ్రీమద్రామయణ వైశిష్ట్యాన్ని వివరించారు. ఆయన మాట్లాడుతూ శ్రీమద్రామయణం భారతీయ జ్ఞాన పరంపరకు నిధి అని వివరించారు. రామాయణంలో అనేక వైజ్ఞానిక అంశాలను వర్ణించడం జరిగిందని తెలిపారు. రామాయణం సర్వమానవాళికి మార్గదర్శకమని, అందులోని అంశాలను అనుసరించి జీవించినట్లయితే ఆనందమయమని, ఆ ఆనందమే రామమయమని వర్ణించారు. అందరూ రామమార్గాన్ని అనుసరించి ముందుకు వెళ్లాలని సూచించారు. సారస్వత అతిథిగా రాష్ట్రీయ సంస్కత విద్యాపీఠం పూర్వ ఉపకులపతి ప్రొ.హరేకష్ణ శతపథి విచ్చేసి శ్రీమద్రామాయణ గొప్పతనాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ చతుర్దశ విద్యా స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి భారతీయ పరంపరకు అత్యంత ముఖ్యమని, ఆ విషయాలన్నీ శ్రీమద్రామాయణంలో మనం విశ్లేషించవచ్చని అన్నారు. శ్రీమద్రామాయణం సర్వ జగద్రక్షకమని రామాయణంలో భారతీయ జ్ఞాన పరంపరకు సంబంధించిన అనేక విషయాలు నిక్షిప్తమై ఉన్నాయని, అందువల్ల భారతీయ పరంపరకు ఒక దర్పణం వంటిది శ్రీమద్రామాయణమని వివరించారు. సభాధ్యక్షులు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ.జిఎస్సార్‌ కష్ణమూర్తి మాట్లాడుతూ శ్రీమద్రామాయణంలో భారతీయ జ్ఞాన పరంపర అనేటువంటి అంతర్జాతీయ సదస్సును సాహిత్య విభాగం ద్వారా ఇక్కడ నిర్వహించడం అత్యంత ఆనందదాయకమని వివరించారు. శ్రీమద్రామాయణం భారతీయ జ్ఞాన పరంపరకు మూల ఆధారమని, ఆదికావ్యం రామాయణం ద్వారా అన్ని అంశాలను వివరించడం జరిగిందని తెలియజేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ రామ మార్గాన్ని అనుసరించి ముందుకు సాగాలని సూచించారు. ఆత్మీయ అతిథులు అకడమిక్‌ డీన్‌ ప్రొ.టి.వి రాఘవాచార్యులు మాట్లాడుతూ శ్రీరాముని లీల ప్రపంచమే భారత సష్టి అని వివరించారు. జ్ఞాన సంబంధ విషయాలన్నీ రామాయణంలో నిక్షిప్తమై ఉన్నాయని వివరించారు. గౌరవాధితులు సాహిత్య సంస్కతి సంకాయ అధ్యక్షురాలు ప్రొ.సి.లలితా రాణి మాట్లాడుతూ శ్రీమద్రామాయణం సర్వజ్ఞాన సమ్మిళితమని, రామాయణంలో అన్ని విషయాలను చాలా స్పష్టంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్‌ గా సాహిత్య విభాగం అధ్యక్షులు ప్రొ.కె.రాజగోపాలన్‌, కోఆర్డినేటర్‌ ప్రొ.సి.రంగనాథన్‌, విశ్వవిద్యాలయం విభిన్న విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️