నేటితో ప్రచారానికి తెర…ప్రలోభాలకు ఎర

May 10,2024 21:37

మద్యం, డబ్బులు పంపిణీకి రంగం సిద్ధం

ఇవీ పనిచేయని చోట బుజ్జగింపులు, బెదిరింపులు

ఓటు విక్రయించుకుంటే జీవితం తాకట్టే

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : సుమారు రెండు నెలలుగా సాగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 6గంటలతో తెరపడనుంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల విజయాలను కాంక్షిస్తూ ఊదరగొడుతున్న బాకాలు మూగబోనున్నాయి. ప్రత్యక్ష ప్రచారానికి తెరపడడానికి ఒక్కరోజు ముందే తెరవెనుక ప్రలోభాలు ప్రారంభమయ్యాయి. ప్రచారంలో తండ్రి కోసం తనయుడు, తనయ కోసం తల్లిదండ్రులు, సతి కోసం పతి, పతికోసం సతి ఇలా కుటుంబ సభ్యులంతా గడిచిన నెలరోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కొందరు, మరోసారి అవకాశం కల్పించాలని ఇంకొందరు వంగివంగి మరీ ఓట్లరకు దండాలు మొక్కుతూ కనిపించారు. మండుటెండలో అభ్యర్థులంతా చేమటోడ్చారు. ఎండధాటికి తాళలేక ఉదయం 8గంటలకే ప్రచారం మొదలుపెట్టి 11గంటలకు ముగించడం, ఉపాధి కూలీలను ఎక్కువగా కలిసి ప్రచారం చేయడం కనిపించింది. సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ప్రచారం సాగించారు. మరోవైపు ఎన్నడూ లేని విధంగా సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని ప్రచారం చేపట్టారు. ఐవిఆర్‌ఎస్‌, ఫోన్‌ కాల్స్‌ ద్వారా ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రధానంగా వైసిపి, టిడిపిలు ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రజలకు ఇచ్చే ఉచిత పథకాలపైనే ఎక్కువగా ప్రచారం చేపట్టారు. మేనిఫెస్టోలో సైతం వాటినే పేర్కొన్నారు. పత్రికలు, టివిలు, యూట్యూబ్‌ ఛానల్స్‌ ఇలా ఏది ఓపెన్‌ చేసినా ఎన్నికల ప్రచారమే కనిపించింది. నామినేషన్ల సందర్భంగా భారీ ర్యాలీలు చేపట్టారు. ప్రచార సామగ్రి, బలనిరూపణకు చాలా చోట్ల రూ.కోట్ల ఖర్చు కనిపించింది.గత రెండు రోజులుగా ప్రచారాన్ని మరింత హోరెత్తించారు. ఎక్కడికక్కడ బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. శనివారం సాయంత్రం నుంచి సభలు, సమావేశాలు, విందులు, మైక్‌ ప్రచారం అన్నీ నిషేధం. జిల్లా అంతటా 144 సెక్షన్‌ అమలు కానుంది. మరోవైపు ప్రచారం ముగియకముందే పలుచోట్ల ఓటుకు నోటు పంపిణీ చేపట్టిన వైసిపి, టిడిపి అభ్యర్థులు శనివారం రాత్రి నుంచి వాటిని మరింత ముమ్మరం చేయనున్నారు. వైసిపి, టిడిపిలు రెండూ మందుబాబులను లోబరుచుకునేందుకు ఇప్పటికే రకరకాల బ్రాండ్లతో కూడిన మద్యం సీసానులను ఇప్పటికే గ్రామాలు, వార్డులకు చేర్చాయి. డబ్బు కూడా గ్రామ స్థాయి నాయకులకు చేరిపోయింది. ఇప్పటికే వలస ఓటర్లకు గాలం వేస్తూ ఛార్జీలు, దారి ఖర్చుల పేరిట డబ్బులు పంపుతున్నారు. చాలా మంది తిరస్కరిస్తున్నప్పటికీ, మొహమాటం పెట్టి మరీ పోన్‌పేలు చేసేస్తున్నారు. మద్యం పంపిణీలో ఇరు పార్టీలూ తీవ్ర పోటీపడడంతో మందుబాబులు గ్రామాల్లో చిందులేస్తున్నారు. మద్యం మత్తులోనైనా ఓట్లు వేయించుకోవాలన్నది పాలకపార్టీల ప్రయత్నం. మద్యం, డబ్బు ఇలా అభ్యర్థుల తరపున ఎవరు ఏమిచ్చినా తీసుకుని, తమకు నచ్చినవారికే ఓట్లేస్తామని కొందరు చెబుతుండగా, కొందరు వీటిని నిరాకరిస్తున్నారు. వీటిని పుచ్చుకోని ప్రచారంలో కలిసి రానివారిని లక్ష్యంగా చేసుకుని, ఇళ్లకు వెళ్లి బుజ్జగించే కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. అప్పటికీ వినిపించుకోకపోతే రాజకీయంగా బెదరింపు చర్యలు కూడా ఉండవని చెప్పలేం. మరోవైపు నిర్భయంగా ఓట్లు వేసుకోవచ్చని అటు ఎన్నికల కమిషన్‌, ఇటు పోలీసు అధికారులు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మందు, డబ్బులకు లోబడి లేదా మద్యం మత్తులో ఓట్లేస్తే రాజ్యాంగ కల్పించిన పౌర హక్కుకు విలువ లేనట్టే. అందుకే విజ్ఞత, విచక్షణతో ఓటు వేసుకోవాలంటూ ఎన్నికల సంఘం కూడా ప్రచారం చేస్తోంది. ఈ సారి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం డబ్బు, మద్యం వంటివి ఎంత ఖర్చుచేసినా వాటి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, ఒకప్పటితో పోలిస్తే ఓటర్లు చైతన్యవంతులయ్యారని చర్చనడుస్తోంది.

➡️