ఈదురుగాలులు, ఉరుములతో కుండపోత వర్షం

సీలేరులో కురుస్తున్న భారీ వర్షం

ప్రజాశక్తి -సీలేరు

జికె.వీధి మండలం సీలేరు ప్రాంతంలో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12.42 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనంతరం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. క్షణాల్లోనే ఈదురుగాలులు, పెద్దపెద్ద ఉరుములతో కుండపోత వర్షం గంటన్నర పాటు కురిసింది. దీంతో రోడ్లు, డ్రైనేజీలు జలమయమయ్యాయి. ఏపీజెన్కో కాలనీ వర్షపు నీరుతో డ్రైనేజీ నుండి చెత్తాచెదారాలు కొట్టుకొచ్చి నివాసప్రాంతాల్లో నిల్వ ఉండిపోయాయి. 8వ క్రాస్‌ రోడ్డు మదుము కింద భాగంలో చెత్త ఇరుక్కుపోయింది. వరద నీరు మసీదు వీధిలో ఏరులై పారింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో గృహిణులు నానా అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి భానుడు ప్రతాపంగా, మధ్యాహ్నం కుండపోత వర్షం కురవడంతో చల్లటి వాతావరణం నెలకొంది. వారపుసంతకు ఆటంకం కుండ పోత వర్షం కారణంగా సీలేరులో ఆదివారం వారపు సంతకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వర్షం కారణంగా వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. గాలి, వర్షం దాటికి రోడ్లపై దుకాణాలు వేసుకున్న చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులకు గురైయ్యారు. దుప్పిలివాడ పంచాయతీకి చెందిన గిరిజనులు వారపు సంతకు తెచ్చిన కూరగాయలు అమ్ముకోలేకపోయారు. మారుమూల గిరిజన గ్రామాల నుంచి వారపు సంతకు వచ్చిన గిరిజనులు తమకు కావలసిన నిత్యావసరుకులు కొనుగోలు చేయడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. జికె.వీధి మండలం దారకొండ, దుప్పిలివాడ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురవడంతో దారకొండ వారపు సంతకు అంతరాయం ఏర్పడింది. నర్సీపట్నం నుంచి వచ్చిన బట్టలు, ఫ్యాన్సీ, తదితర వ్యాపారులు వ్యాపారాలు నిలిచిపోవడంతో డీలాపడ్డారు.

➡️