గెలిచే ప్రయత్నం.. గెలుస్తాననే ధీమా..

May 7,2024 00:40

బొల్లా బ్రహ్మనాయుడు (వైసిపి), జీవీ ఆంజనేయులు (టిడిపి), చెన్నా శ్రీనివాసరావు (కాంగ్రెస్‌)
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
వినుకొండ నియోజకవర్గంలో టిడిపి, వైసిపి అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోటీ జరుగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌ అభ్యర్థులతోపాటు మొత్తం 14 మంది పోటీలో ఉన్నారు. వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరోసారి పోటీచేస్తుండగా గత ఎన్నికల్లో ఓడిపోయిన టిడిపి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు కూడా మరో సారి పోటీలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెన్నా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన ఆంజనేయులు 2019లో ఓడిపోయారు. 2019లో టిడిపి పై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వల్ల వైసిపి అభ్యర్థి బొల్లాబ్రహ్మనాయుడు 32వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈసారి వైసిపి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోపాటు తాను చేసిన సేవాకార్యక్రమాలు తనను గెలిపిస్తాయని టిడిపి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు చెబుతున్నారు. తాను చేసిన అభివృద్ధిపథకాలతోపాటు గత ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని వైసిపి అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. అంతేగాక పార్లమెంటు సభ్యులు అనిల్‌కుమార్‌ వల్ల తమ పార్టీకి బిసి ఓట్లు పెరుగుతాయని ఆయన చెబుతున్నారు. 2004 నుంచి ఆంజనేయులు నియోజకవర్గాన్ని అంటిబెట్టుకుని ఉన్నారు. 2009, 2014లో ఆయన గెలుపొందారు. వ్యాపార వేత్తగా పేరొందిన బొల్లా బ్రహ్మనాయుడు 2009లో ప్రజారాజ్యం తరఫున వినుకొండ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పెదకూరపాడులో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019లో ఆయనవినుకొండ నుంచి వైసిపి అభ్యర్థిగాపోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో బొల్లాకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జనరావు ఈసారి టిడిపిలో చేరి జి.వి.ఆంజనేయులు విజయంకోసం కృషి చేస్తున్నారు. గత రెండు నెలలుగా బొల్లా, జి.వి.ఆంజనేయుల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. 1952లో సిపిఐ అభ్యర్ధి పి.వెంకట శివయ్య స్వతంత్ర అభ్యర్ధి పిఎన్‌.చౌదరిపై గెలిచారు. 1955లో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎన్‌.గోవిందరాజు సిపిఐ అభ్యర్ధి పి.వెంకట శివయ్యపై గెలుపొందారు. 1962లో సిపిఐ అభ్యర్ధి పి.వెంకట శివయ్య కాంగ్రెస్‌ అభ్యర్ధి భవనం జయప్రదపై విజయం సాధించారు. 1967లో కాంగ్రెస్‌ అభ్యర్ధి భవనం జయప్రద స్వతంత్ర అభ్యర్ధి ఎ.వెంకటేశ్వర్లుపై గెలిచారు. 1972లో కాంగ్రెస్‌ అభ్యర్ధి భవనం జయప్రద సిపిఐ అభ్యర్ధి పి.వెంకట శివయ్యపై గెలుపొందారు. 1978లో స్వతంత్ర అభ్యర్ధి ఆవుదారి వెంకటేశ్వర్లు స్వతంత్ర అభ్యర్ధి జి.వెంకటేశ్వర్లుపై విజయం సాధించారు. 1983లో స్వతంత్ర అభ్యర్ధి జి.వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎ.వెంకటేశ్వర్లుపై గెలిచారు. 1985లో సిపిఐ అభ్యర్ధి జి.వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ అభ్యర్ధి సిహెచ్‌.వి.నారాయణరావుపై గెలుపొందారు. 1989లో కాంగ్రెస్‌ అభ్యర్ధి నన్నపనేని రాజకుమారి స్వతంత్ర అభ్యర్ధి వి.యల్లమందరావుపై విజయం సాధించారు. 1994లో స్వతంత్ర అభ్యర్ధి వి.యల్లమందరావు కాంగ్రెస్‌ అభ్యర్ధి నన్నపనేని రాజకుమారిపై గెలిచారు. 1999లో టిడిపి అభ్యర్ధి వి.యల్లమందరావు కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎం.మల్లికార్జునరావుపై గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎం.మల్లికార్జునరావు టిడిపి అభ్యర్ధి జి.లీలావతిపై విజయం సాధించారు. 2009లో టిడిపి అభ్యర్ధి జివి.ఆంజనేయులు కాంగ్రెస్‌ అభ్యర్ధి చేబ్రోలు నరేంద్రనాథ్‌పై గెలిచారు. 2014లో టిడిపి అభ్యర్ధి జివి.ఆంజనేయులు వైసిపి అభ్యర్ధి ఎన్‌.సుధపై గెలుపొందారు. 2019లో పోటీ టిడిపి అభ్యర్థి జి.వి.ఆంజనేయులపై వైసిపినుంచి పోటీ చేసిన బొల్లాబ్రహ్మనాయుడు 32 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇండియా కూటమి తరుఫున కాంగ్రెస్‌నుంచి చెన్నా శ్రీనివాసరావు బరిలో నిలిచారు.

➡️