అమ్మో వసతి గృహం

Jun 16,2024 20:54

ప్రజాశక్తి – భోగాపురం: భోగాపురం మండల కేంద్రంలోని బాలుర వసతిగృహం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇక్కడ విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. ఇటు అధికారులు, అటు ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విద్యార్ధులు వసతి గృహాన్ని చూసి చేరేందుకు భయపడుతున్నారు. ఇప్పటికే చేరిన విద్యార్థులు కూడా శిథిల వసతి గృహంలో ఉండేందుకు భయడపడుతున్నారు. ఎప్పుడు కూలిపోతుందోనన్న భయంతో రాత్రి పూట నిద్ర కూడా పట్టడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.మండలంలో గతంలో నాలుగ వసతి గృహాలుండేవి. ఇందులో బాలికల బిసి వసతిగృహం తీరప్రాంతమైన ముక్కాంలో ఉండగా, గతేడాది మద్యలోనే బాలికలు మానేయడంతో ఇది మూతబడింది. మరో మూడు వసతి గృహాలు మండల కేంద్రంలో ఉండేవి. ఇందులో ఎస్‌సి బాలికల వసతిగృహం మూసివేశారు. అనంతరం ఎస్‌సి బాలుర వసతిగృహాన్ని కూడా మూసేశారు. చివరకు బిసి బాలుర వసతిగృహం ఒక్కటే మిగిలింది. ఇది కూడా శిథిలావ్థకు చేరుకోవ డంతో పాత ఎస్‌సి బాలికల వసతి గృహంలోకి విద్యార్థులను మార్చారు. ఇప్పుడు ఇది కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరి విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్నారు.35 ఏళ్ళ కిందట నిర్మించడంతో శిథిలావస్థకుప్రస్తుతం విద్యార్ధులు ఉంటున్న వసతిగృహం నిర్మించి సుమారు 35 సంవత్సరాలు కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇందులో సుమారు 70 మంది విద్యార్ధులు చదువుతున్నారు. ముఖ్యంగా విద్యార్ధులు నివాసం ఉండే గదుల్లో శ్లాబు పెచ్చులు రాలి పడిపోతున్నాయి. వర్షం వస్తే చాలు గదులన్ని వర్షపు నీటితో కారిపోతున్నాయి. ఇక డైనింగ్‌ హాల్‌ పూర్తిగా శ్లాబు పెచ్చులు పడిపోవడంతో దానిని పూర్తిగా వాడకుండా వదిలేశారు. వసతిగృహంపై ఉన్న పిట్టగోడ సైతం పగుళ్ళు రావడంతో అది కూడా కూలిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యలు నడుమ విద్యార్ధులు భయంభయంగా గడుపుతున్నారు. కనీస మరమ్మత్తులు కూడా చేయని అధికారులువసతిగృహం మరమ్మత్తులు చేసేందుకు కూడా అధికారులు కనీసం ముందుకు రావడం లేదని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లగా మరమ్మత్తు పనులు చేయాలని వసతిగృహ వార్డెన్‌లు కోరినప్పటికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు దృష్టికి కూడా స్థానిక అధికారులు తీసుకు వెళ్ళారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుత ఎమ్మెల్యే లోకం మాధవి దృష్టి సారించి కనీస మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.

➡️