సొంతనూరులో పనిలేక పొరుగూరుకు ప్రమాదకరంగా..

Apr 10,2024 00:14

ప్రజాశక్తి – పెదకూరపాడు : పొలం పనుల్లేక, ఉపాధి హామీ అమలవ్వక వ్యవసాయ కూలీలు వలస బాట పడుతున్నారు. మండే ఎండల్లోనూ ఇతర ప్రాంతాలకు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. పెదకూరపాడు ప్రాంతంలో వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి పంటలే ప్రధాన సాగు. ఏ కొత్త వంగడమైన పెదకూరపాడులోనే ప్రయోగించేవారు. తరువాత ఆ విత్తనాలను మిగతా ప్రాంతాల్లో మార్కెట్‌ చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం పాలకుల వైఫల్యం, ప్రకృతి సహకరించకపోవడంతో వ్యవసాయం దెబ్బతింది. దీంతో రైతులతోపాటు వ్యవసాయ కూలీలు సైతం దూర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లే దుస్థితి ఏర్పడింది. నాగార్జునసాగర్‌ నీరు అందని గ్రామాలు పెదకూరపాడు మండలంలో 12 ఉన్నాయి. ఈ ప్రాంతంలో పనుల్లేక సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు, అచ్చంపేట మండలం తాళ్ల చెరువు, కస్తల, కోనూరు, క్రోసూరు మండలం నాగవరం ప్రాంతాలకు వెళుతున్నారు. మరోవైపు పశువులకు మేత కూడా దొరకడం లేదు. పంటల దిగుబడి అంతంతమాత్రంగానే ఉండడం, ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులూ నష్టాలను చవిచూశారు.
ఉపాధి హామీ పనులు చేపట్టాలి
జి.రవిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి.
కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం లేకుండా ఏ ఊరిలో వారికి ఆ ఊరిలోనే ఉపాధి హామీ చట్టం కింద సత్వరమే పనులు కల్పించాలి. 100 రోజుల నుండి 150 పని దినాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. వేసవి అలవెన్సులు ప్రకటించాలి.

➡️