మచ్చుకైనా కానరాని పచ్చదనం!

భీమిలిలోని జివిఎంసి పార్కులు

వెలవెలబోతున్న భీమిలిలోని జివిఎంసి పార్కులు

పెదవి విరుస్తున్న సందర్శకులు

వేసవిలో పిల్లలకు ఆటవిడుపు లేని పరిస్థితులు

నిర్వహణలో నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు

ప్రజాశక్తి – భీమునిపట్నం : పరుగులెడుతున్న జీవితంలో కాసింత ఆటవిడుపు, ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో అనేకమంది పార్కులను సందర్శించడం పరిపాటి. అయితే భీమిలి జోన్‌ పరిధిలో పలు పార్కులకు వచ్చిన సందర్శకులు అక్కడ మచ్చుకైనా పచ్చదనం కానరాకపోవడంతో పెదవి విరుస్తున్నారు. సముద్రం నుంచి వచ్చే గాలి తప్ప, అక్కడ కూర్చొనేందుకు క్రోటన్‌ మొక్కల నీడైనా లేదని వాపోతున్నారు. జివిఎంసి యంత్రాంగం నిర్లక్ష్యం, నిర్వహణాలోపం వల్ల ఎడారిని తలపించేలా పార్కులు దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జివిఎంసి భీమిలి ఒకటో జోన్‌లో సాగర తీరాన లైట్‌ హౌస్‌కు ఆనుకుని ఉన్న మహాత్మాగాంధీ పార్కు, గోకుల్‌ పార్కుల్లో పచ్చదనం మచ్చుకు కూడా కనబడని పరిస్థితి నెలకొంది. మానసిక, శారీరక ఒత్తిడికి గురైన ప్రజలు కాసింత ఉపశమనం పొందేందుకు సాగర తీరాన ఉన్న పార్కులకు వస్తే నిరుత్సాహానికి గురయ్యే పరిస్థితులున్నాయిజ ఇక్కడున్న పార్కులకు వచ్చే వారు ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూసి ఆనందిస్తూ, చల్లని గాలిని ఆస్వాదించడమే తప్ప, పార్కుల్లో సేదదీరే పరిస్థితి లేదు. పార్కుల్లో పచ్చిక బయళ్లు, క్రోటన్స్‌ మొక్కలు, చెట్ల కిందన ఉన్న బెంచీలు వంటివేవీ ఇక్కడున్న పార్కుల్లో కానరావు. జివిఎంసి ఏర్పాటు చేసిన సాగరకన్య, డాల్ఫిన్‌, మత్యకారుని బొమ్మ, మహాత్మాగాంధీ, బుద్ధుని బొమ్మలు, భీమిలి పేరుతో లవ్‌ సింబల్‌ వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నా, పచ్చదనం లేని పార్కులేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పార్కు ఎంత విశాలంగా ఉన్నా, ఎన్ని కృత్రిమంగా ఏర్పాటుచేసినా బొమ్మలు, ఇతరత్రా హంగులు ఉన్నా, గ్రీనరీ లేకుంటే ఏదో వెలితి కొట్టొచ్చినట్టు కనబడుతుందనడం లో ఏమాత్రం సందేహం లేదు. పార్కుల్లో పచ్ఛిక బయళ్ళు, చుట్టూరా అందమైన పచ్చని మొక్కలు ఉంటే పార్కుల అందమే వేరు. ప్రస్తుత వేసవిలో పాఠశాలలకు సెలవులు రానే వచ్చాయి. పార్కులకు వచ్చే పిల్లలు అనుభూతి పొందాలంటే, నీలి సంద్రమే కాదు. పరుచుకున్న పచ్చదనం కూడా ఉండాలి. అప్పుడే పిల్లల ఆనందానికి అవధులు లేకుండా ఉంటుంది. గ్రీనరీ వలన అందం, ఆహ్లాదమే కాదు , పర్యావరణ పరిరక్షణకు కూడా పచ్చదనం ఎంతగానో దోహదపడుతుంది. ఆ దిశగా జివిఎంసి అధికారులు దృష్టి సారించాలని పలువురు సందర్శకులు కోరుతున్నారు

మహాత్మాగాంధీ పార్కు,

➡️