ఎండ మండిపోతోంది.. గొంతెండి పోతోంది

Feb 18,2024 20:41

ప్రజాశక్తి – జామి : ఎండ మండిపోతోంది… గొంతెండి పోతోంది.. పని ప్రదేశాల్లో టెంట్లు, చలివేంద్రాలు లేవు. దెబ్బతగిలితే కట్టు కట్టుకునే మెడికల్‌ కిట్లు కూడా కానరావు. గిట్టుబాటు కాని కూలి కోసం పనులు చేస్తున్న కూలీలు సొమ్మసిల్లిపోతున్న పరిస్థితి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు పరిశీలిస్తే… ఇట్టే కూలీలు పాట్లు అర్థమైపోతాయి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వలసల నిర్మూలనతో పాటు పేదవాడికి పని భద్రత కల్పించాలన్న లక్ష్యంతో ఉపాధి హామీ పనులకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. కానీ నేడు గ్రామీణ ఉపాధి హామీ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అపహాస్యం చేస్తున్నాయి. ఇప్పటికే ఉపాధి నిధులకు ఏటా కోత విధిస్తున్న ప్రభుత్వం.. వేసవి ఎండలో పని చేసే కూలీలకు అందాల్సిన రాయితీలను కూడా కోత విధించింది. చివరికి పని ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యాలను కూడా లేకుండా చేసింది. ఫిబ్రవరిలోనే ఎండలో మండిపోతున్న నేపథ్యంలో ఉపాధి పనులకు వెళ్లడానికి కూలీలు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి…
జామి మండలంలో 25 పంచాయతీలకు గానూ 12,125 జాబ్‌ కార్డుల ద్వారా సుమారు 24 వేల మంది వరకు కూలీలు ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. గతేడాది సరాసరి వేతనంగా ప్రభుత్వం రూ.257కు రూ.231 వేతనం కూలీలకు నమోదు చేసింది. కానీ ఈ ఏడాది వేసవి ఎండలకు కూలీలు పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రభుత్వం రెండు పూటలా పనులు చేయాలంటూ, రోజు కూలి రూ.270 రావాలని చెబుతుంది. కానీ అందుకు తగ్గ సౌకర్యాలు మాత్రం ఏర్పాటు చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే కూలీలు పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
కానరాని టెంట్లు
ఉపాధి పనులు చేయాలనే గ్రామాల్లో సుదూర ప్రాంతాల్లో ఉన్న చెరువులకు చేరుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన వేతనం నమోదు కావాలంటే కూలీలు రెండు పూటలు పనులు చేయాలని అధికారులు చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు బయలుదేరి పని ప్రదేశాలను వెళ్లడానికి కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. తీరా ఎండలో అంత దూరం నడిచాక, అక్కడ నిలువ నీడ లేకపోవడంతో మండుటెండలకు కూలీలు వడ దెబ్బబారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం గానీ, అధికారులు గానీ టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. కనీసం తాగడానికి నీరు అందుబాటులో లేని దుస్థితి. ఈ నేపథ్యంలోనే కూలీలు నరకయాతన అనుభవిస్తున్నారు. కనీసం మెడికల్‌ కిట్లు కూడా పని ప్రదేశాల్లో కనిపించడం లేదని కూలీలు వాపోతున్నారు.
వేసవి రాయతీల్లో కోత
గత ప్రభుత్వంలో వేసవి రాయితీ కింద కూలీలకు అదనపు అలవెన్స్‌ అందజేసేవారు. ఎండాకాలంలో కూలీలు పనులు చేయలేరు కాబట్టి.. కొంత అదనపు ఆలవెన్స్‌ కింద అందించేవారు. వేసవి మూడు నెలల్లో 20 నుంచి 30 శాతం అదనపు పని కలిపేవారు. కానీ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వేసవి అలవెన్సులు కోత విధించింది. తాగు నీటి సదుపాయం, గునపాలు, పారలు ఇలా, కూలీలకు అవసరమైన సదుపాయాలు లేకుండా చేసింది. ఈ నేపథ్యంలోనే ఉపాధి పనులు నరకయాతనగా ఉన్నాయని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేసవి అలవెన్సులు అమలు చేయాలి
ఉపాధి కూలీలు వడదెబ్బకు గురికాకుండా పనిప్రాంతాల్లో టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటుచేయాలి. ప్రభుత్వం గతం మాదిరిగా వేసవి అలవెన్సులు అమలు చేయాలి. కూలీలను రెండు పూటలు కాకుండా ఒకే పూట పనులు చేసి, ప్రి మెజర్మెంట్‌ ద్వారా కూలి రూ.600 ఇవ్వాలి. ఉపాధి నిధులు దారిమళ్లించకుండా కూలీల మట్టి పనులకే అత్యధిక నిధులు ఖర్చు పెట్టేలా చర్యలు తీసుకోవాలి.
-జి.శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి

➡️