సాగు సమయం.. రైతులకిస్తామన్న పెట్టుబడిసాయమివ్వండి : ఎపి రైతు సంఘం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాలో వర్షాలు కురుస్తున్న వేళ ఖరీఫ్‌ పంటల సాగుకు, రైతులకు కావల్సిన విత్తనాలు, ఎరువులు, దుక్కులకు పెట్టుబడి అవసరం అని, నూతన రాష్ట్ర ప్రభుత్వం రైతుకు 20,000 రూపాయలు అందిస్తామన్న పెట్టుబడి సాయం రైతులకు, కౌలు రైతులకు వెంటనే ఇప్పించాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు డిమాండ్‌ చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ … తాటిపూడి ప్రొజెక్ట్‌ కాలువలు పూడిక, జంగిల్‌ డివిజన్‌ డామ్‌ల వద్ద షట్టర్లు పాడవటం వల్ల నీరు పొలాలకు సక్రమంగా వెళ్ళకపోవడంతో నీటి పంపిణీ సిబ్బంది, లష్కర్లు లేకపోవటం వల్ల చివరి ఆయకట్టు వరకు నీరు వెళ్ళక పంటలు నష్టపోతున్నారన్నారు. మధుపాడ నుండి రామభద్రపురం డివిజన్‌ డామ్‌ వరకు కాలువ జంగిల్‌, పూడిక తొలగించాలన్నారు. బోనంగి సేరి కాలువ వద్ద ముటా కాలువకు గండి పడటం వల్ల సేరికాలువ కింద 400 ఎకరాలకు నీరు వెళ్ళడం లేదని చెప్పారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలనీ కోరారు. వసాది- వెలగాడ డివిజన్‌ డామ్‌ వద్ద ఒక షట్టర్‌ పాడవ్వటం వల్ల నీటి పారుదల వ్యత్యాసం వల్ల ఒక ప్రాంతానికి నష్టం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే షట్టర్‌ ని సరిచేయలనీ కోరారు. రామభద్రపురం డివిజన్‌ డామ్‌ వద్ద షట్టర్‌ పాడయ్యిందని బాగుచేయాలనీ కోరారు. రేగుబిల్లి-బురదపాడుకాలువకు వసాది శివాలయం వద్ద కాలువకు గండి పడినది వెంటనే పూడ్చాలని కోరారు. జామి పల్లపు కాలువనుండి అప్పన్నపాలెం డివిజన్‌ డామ్‌ వరకు 1.2 కి.మీ. పూడిక వల్ల నీరు సరిగా రాకపోవటం వల్ల పంటలకు సకాలంలో నీరు రావటం లేదన్నారు. చివరి ఆయకట్టుకి నీటిఎద్దడి ఏర్పడుతుందన్నారు. వెన్నుపాడు, వెంకటరాజుపాలెం డివిజన్‌ డామ్‌ కొలప్స్‌ అవ్వటం వల్ల జన్ని వలస, సోమయాజులపాలెం తదితర చివరి ఆయకట్టుకి నీరు సరిగ్గా అందక పంటలు దెబ్బతింటున్నాయని, వెంటనే బాగు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌.గోపాలం, ఎల్‌.ఆదినారాయణ, ఆర్‌.సత్యం, టి.పైడిపినాయుడు, రాకోటి రాములు, రైతులు పాల్గొన్నారు.

➡️