ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Mar 21,2024 19:29

ప్రజాశక్తి-బొబ్బిలి : ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రిటర్నింగ్‌ అధికారి ఎ.సాయిశ్రీ హెచ్చరించారు. తన కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల కోడ్‌ పర్యవేక్షణకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎక్కడ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరిగితే కంట్రోల్‌ రూమ్‌కు పిర్యాదు చేస్తే వెంటనే సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటింటి ప్రచారం చేయడానికి కూడా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కోరారు. ప్రతి పర్మిషన్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి పొందాలన్నారు. నోడల్‌ అధికారులుగా అన్ని శాఖల నుంచి నియమించామని చెప్పారు. 19 కేటగిరీలు అనుమతులు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. లౌడ్‌ స్పీకర్లకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్‌ స్థలంలో జెండాలు, ఫ్లెక్సీలు కడితే స్థల యజమాని అంగీకార పత్రంతో అనుమతికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.10 వేలు కంటే ఎక్కువ మెటీరియల్‌ తరలించినా, రూ.50 వేలు కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లినా సీజ్‌ చేస్తామన్నారు.
ఎన్నికల కోడ్‌ అమలుకు సహకరించాలి
ఎన్నికల కోడ్‌ అమలుకు సహకరించాలని రిటర్నింగ్‌ అధికారి ఎ.సాయిశ్రీ కోరారు. స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో గురువారం ఎన్నికల కోడ్‌ అమలుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ రామలక్ష్మి, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కోడ్‌ ఉల్లంఘనపై నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు.

➡️