కదం తొక్కిన సమగ్ర శిక్ష ఉద్యోగులు

కలెక్టరేట్‌ వద్ద రాస్తారోకో నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : తమను రెగ్యులర్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, తక్షణమే గ్రాస్‌ పే అమలు చేయాలని, ఇతర ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. సమగ్ర శిక్ష పరిదిలో మండల విద్యాశాఖా కార్యాలయాల్లో పనిచేస్తున్న సిఆర్‌ఎంటిలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐ ఎస్‌ కోర్డినేటర్లు, మండల లెవెల్‌ అకౌంటెంట్లు, మెసెంజర్లు, సహిత విద్యా రిసోర్స్‌ పర్సన్లు , భవిత, ఫిజియో థెరపిస్టులు, పాఠశాలల్లో పనిచేస్తున్న ఆర్ట్‌, కాప్ట్‌, పి.ఈ.టి పార్ట్‌ టైం టీచర్లు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎపి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు మాట్లాడారు. సమగ్ర శిక్షా ప్రాజెక్ట్‌ లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అందరికీ మినియం ఆఫ్‌ టైం స్కేల్‌అమలు చేసి, వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఔట్సోర్సింగ్‌ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోని మార్చి మినియం ఆఫ్‌ టైం స్కేల్‌ అమలు చేసి, వేతనాలు పెంచాలన్నారు. ప్రస్తుతం ఉన్న పార్ట్‌ టైం విధానాన్ని రద్దు చేసి, ఫుల్‌ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ గ్రాట్యుటీ 10 లక్షలు ఇవ్వాలన్నారు. సామాజిక భద్రత పథకాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు మంజూరు చేయాలి, మెరుగైన హెల్త్‌ స్కీం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. డైలీ వైజ్‌, ఎంఇఒ కార్యాలయాల్లో టెంపరరీ లేదా స్టాఫ్‌ గ్యాప్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను కాంట్రాక్టు ద్దతిలోనికి తీసుకోవాలనీ డిమాండ్‌ చేశారు.. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి, కారుణ్యనియమాలు చేపట్టాలని,మహిళా ఉద్యోగులకు చైల్డ్‌ కేర్‌ లీవులు మంజరు చేయాలని, ప్రతి నెల ఒకటి తేదికి వేతనాలు చెల్లించాలని కోరారు. .అనంతరం డిఇఒ బి.లింగేశ్వర రెడ్డి ధర్నా వద్దకు వచ్చి ఉద్యోగులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ధర్నాలో నాయకులు కె.గురువులు, బి.రవీంద్రబాబు, రేజేటి కరుణాకర్‌, ఉమాశంకర్‌, ఆర్‌.శ్రీనివాసరావు, వై.శ్రీనివాసరావు, లక్ష్మి,కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️