కలెక్టరేట్‌లో అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు చర్యలు

Jan 12,2024 21:31

ప్రజాశక్తి-విజయనగరం : కుల మతాలకు అతీతంగా అన్నివర్గాల హక్కుల కోసం, అభ్యున్నతి కోసం పాటుపడిన అంబేద్కర్‌ అందరివాడని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. సామాజిక సమతా సంకల్ప మహోత్సవంలో భాగంగా కలెక్టరేట్‌ ఆడిటోరియంలో అవగాహనా సదస్సు ఘనంగా నిర్వహించారు. డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్‌ నాగలక్ష్మి, జె.సి మయూర్‌ అశోక్‌, దళిత నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. తొలుత సమాచార శాఖ వారు అంబేద్కర్‌ జీవిత చరిత్ర పై ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్‌ ను కలెక్టర్‌, జె సి సందర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ ఉద్యోగం కోసం ఉన్నత చదువులు చదవలేదని, విజ్ఞానార్జన కోసం, సమాజానికి తన చదువు ఉపయోగపడాలని చదివారని తెలిపారు. చదువే కాకుండా కుల, మత, రాజకీయ, ఆర్ధిక అంశాల పై అనేక పుస్తకాలను రచించారని , విద్యార్థులు కొంత సమయాన్ని కేటాయించి వారి రచనలను చదవాలని, ప్రతి విద్యార్థి అంబేద్కర్‌ జీవిత చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. సమావేశంలో ట్రైబల్‌ యూనివర్సిటీ ఆచార్య జితేంద్ర మోహన్‌, డివిఎంసి సభ్యులు జయరాజ్‌, భానుమూర్తి, శ్రీను, దళిత నాయకులు ఉదరు భాస్కర్‌, రామునాయుడు తదితరులు మాట్లాడారు.

➡️