కాంగ్రెస్‌లో జవసత్వాలు

Jan 22,2024 21:00

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : జిల్లాలో పార్టీలో జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే ఎన్నికల సన్నద్ధత కోసం పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల మంగళవారం జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు విజయనగరంలోని క్షత్రియ కల్యాణమండపంలో పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయనున్నారు. ప్రస్తుత అధికారంలోకి ఉన్న వైసిపిలో నాటి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలే 99శాతం మంది ఉన్నారు. ఈనేపథ్యంలో పార్టీలో అసంతృప్తి, వ్యతిరేకత ఉన్నవారిని కాంగ్రెస్‌లోకి లాగేందుకు యత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. షర్మిల రోజుకు మూడు జిల్లాల చొప్పున పర్యటించేందుకు షెడ్యూలు ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం నుంచి ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశంలో నాయకులకు ఆమె దిశా నిర్థేశం చేయనున్నారు. ఆమె తొలి పర్యటన ముగిశాక జిల్లా నుంచి కొన్ని చేరికలు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వైసిపిలో టిక్కెట్‌ ఆశించి, భంగపడినవారు కాంగ్రెస్‌ తరపున పోటీ చేసేందుకు సిద్ధపడవచ్చనే భావన చాలా మంది నోట వినిపిస్తోంది. ఒక వేళ కాంగ్రెస్‌ బలపడితే ఆ ప్రభావం టిడిపి, జనసేన పార్టీలకన్నా వైసిపిపైనే ప్రభావం ఎక్కువగా ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో వైసిపి ఓట్లు ఎంతమేర చీలినా, ఆ మేరకు వైసిపికే నష్టం జరుగుతుందని కూడా చర్చనడుస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిల పర్యటన జిల్లాలో ఆసక్తికర పరిణామంగా మారింది. కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం జిల్లా కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం ఉందని పలువురు నాయకులు లోలోపల మదన పడుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు సరగడ రమేష్‌ కుమార్‌ తీరుపై స్ధానిక నాయకులు బాహాటంగా తిరుగు బాటుకు సిద్ధం అవుతున్నారు. జిల్లాలో గత కొంత కాలంగా లోలోపల పార్టీ నాయకుల మధ్య అధికారం కోసం కుమ్ములాటలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న నాయకులను ఏకతాటి పైకి తీసుకు రావడంలో అధ్యక్షుడు విఫలమయ్యారన్న చర్చ జరుగుతోంది. పదవి చేపట్టిన నాటి నుంచి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటు న్నారంటూ జిల్లా, పట్టణ నాయకులు ఆయనపై మండి పడుతున్నారు. ఎవరినీ పట్టించుకోకుండా తన నచ్చినప్పుడు సమావేశాలు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి ఇబ్బందని అంటున్నారు. నూతన పిసిసి అధ్యక్షులు షర్మిల రాక తోనైనా తీరుమారేనా, లేక తాను మారేనా! అంటూ నాయకులు వాపోతున్నారు.

➡️