కార్పొరేషన్‌ ఆదాయానికి గండి

Feb 18,2024 20:49

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కాదేది డబ్బులు సంపాదించడానికి అనర్హం అన్న రీతిలో నగరంలో బ్యాడ్మింటన్‌, క్రికెట్‌ కోచింగ్‌ నెట్‌ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. రోజురోజుకూ ఆరోగ్యంపై ప్రజల్లో శ్రద్ధ పెరిగింది. మరోవైపు ప్రయివేట్‌ పాఠశాలల్లో శారీరక వ్యాయామాలు లేవు. దీంతో ఫిజికల్‌ ఫిట్నెస్‌ కోసం వ్యాయామశాలల్లో, క్రికెట్‌ కోచింగ్‌ సెంటర్లలో, గేమ్స్‌ నేరో కేంద్రాల్లో చేరుతున్నారు. క్రికెట్‌, బ్యాడ్మింటన్‌కు ఆదరణ ఉండటంతో ఎక్కువమంది తల్లిదండ్రులు పిల్లలను కోచింగ్‌ కేంద్రాల్లో చేర్పిస్తున్నారు. బ్యాడ్మింటన్‌లో అసోసియేషన్‌ తరపున నిర్వహిస్తున్న కోచింగ్‌ శిబిరాల్లో కొద్దిమందికి అవకాశం ఉంటోంది. ఆట స్థలాలు, ఇండోర్‌ స్టేడియాలు లేకపోవడంతో నెట్‌ కోచింగ్‌ సెంటర్లు ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి. క్రీడల సాధనకు పెద్ద మైదానాలు, ఇండోర్‌ స్టేడియాలు ఉండాలి. అటువంటిది ఏమీ లేకుండా కేవలం 300 నుంచి 500 గజాల స్థలం ఉంటే చాలు. ఆ స్థలంలో చుట్టూ నెట్‌ కట్టి కేవలం పిచ్‌కు సరిపడే స్థలంలో కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సొంత స్థలంలో కొంతమంది ఏర్పాటు చేస్తే మరి కొందరు స్థలాలు లీజుకు తీసుకుని నెట్‌ కట్టి కోచింగ్‌ సెంటర్లుగా మారుస్తున్నారు. ఇంకొంతమంది ఇంటి పై భాగంలో నెట్‌ కట్టి అందులో కోచింగ్‌ నిర్వహిస్తున్నారు. నగరంలో సుమారు 25 వరకు ఇటువంటి కేంద్రాలు వెలిశాయి.
అత్యధిక ఫీజులు వసూలు…
శారీరక వ్యాయామాల కోసం పిల్లల్ని చేర్పిస్తున్న తల్లిదండ్రులు ఎంత డబ్బులు చెల్లించేందుకైనా వెనుకాడటం లేదు. ఇదే అదునుగా కోచింగ్‌ సెంటర్లు క్రికెట్‌కు ఒక్కొక్కరి నుంచి రూ.500 నుంచి 1000, బ్యాడ్మింటన్‌కు రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. వీటితోపాటు క్రీడా సామగ్రి తెప్పించి కోచింగ్‌ నిర్వాహకులు అమ్మడం ద్వారా కూడా భారీ ఆదాయం సంపాదిస్తున్నారు.
అనుమతులు లేకుండానే..
నగర పాలక సంస్థ అనుమతి లేకుండా కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసినా వేకెంట్‌ టాక్స్‌ కట్టాల్సి ఉంది. అదే విధంగా కోచింగ్‌ ప్రచారం కోసం పెట్టే బోర్డులను కూడా అడ్వర్టైజ్‌మెంట్‌ పన్ను కట్టాల్సి ఉంది. వీటితోపాటు ముందుగా ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంది . ఇవేవీ చెల్లించకుండా నగర పాలక సంస్థకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. విచ్చలవిడిగా ఇటువంటి శిక్షణ కేంద్రాలు నగరంలో పుట్టుకొస్తుంటే కనీసం వాటి గురించి నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నగర పాలక సంస్థకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ఇదే నిర్లక్ష్య వైఖరి కొనసాగితే నగరంలో మరిన్ని కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి.

➡️