కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం

Jan 12,2024 21:32

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాడాలని, అంగన్వాడీలకు అండగా ఉంటామని సిపిఎం, యుటిఎఫ్‌, సిఐటియు నాయకులు అన్నారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారం 32వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా కలెక్టరేట్‌ వద్ద సమ్మె శిబిరంలోనూ సంతకాల సేకరణ చేపట్టారు. సమ్మెకు మద్దతు గా కోటి సంతకాల సేకరణను యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు కృష్ణంనాయుడు, సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టినా, ఎస్మా ప్రయోగించినా, రాత్రీ పగలు చలిలో దీక్షలు చేస్తూ 32 రోజులుగా పోరాడుతున్న అంగన్‌వాడీలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఏరియాలో వాహనాలు మీద వచ్చిన వారి నుంచి, ప్రజల నుంచి సంతకాలు సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ విజయనగరం మండల కార్యదర్శి రామకృష్ణ, గౌరవాధ్యక్షులు శ్రావణ కుమార్‌, జిల్లా కార్యదర్శి సత్యన్నారాయణ, సిఐటియు ఉపాధ్యక్షులు బి.సుధారాణి, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. పూసపాటిరేగ : ఎస్మా ప్రయోగించిన తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదని అంగన్వాడీలు అన్నారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా సంతకాలు సేకరణ చేపట్టారు.అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు కృష్ణమ్మ, శ్రీలక్ష్మి, కొరలమ్మ, అనసూయతో పాటు డెంకాడ, భోగాపురం, పూసపాటి మండలాల్లోనే అంగన్వాడీలు, సిఐటియు నాయకులు బి.సూర్యనారాయణ పాల్గొన్నారు. బొబ్బిలి : అంగన్వాడీలకు యుటిఎఫ్‌ మద్దతు ప్రకటించింది. అంగన్వాడీలు చేపట్టిన కోటి సంతకాల సేకరణలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి, తదితరులు సంతకాలు చేసి మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కామేశ్వరి, నిర్మల పాల్గొన్నారు.బాడంగి : బాడంగిలో అంగన్వాడీల సమ్మె శిబిరం శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్మా చట్టం జిఒ నంబరు 2 పత్రాలను మంటల్లో వేసి దహనం చేశారు.గజపతినగరం : గజపతినగరంలో అంగన్వాడీలు సంతకాల సేకరణ చేపట్టారు. అంగన్వాడీ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వి.లక్ష్మి, ప్రాజెక్టు అధ్యక్షులు ఎం.సుబాషిణి, సెక్టార్‌ లీడర్లు రాములమ్మ, సుజాత, నరసమ్మ, రమణమ్మ, సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.రామభద్రపురం : స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద అంగన్వాడీల సమ్మె శిబిరంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.శ్రీనివాసరావు, అంగన్వాడీలు పాల్గొన్నారు.శృంగవరపుకోట : పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు డి.శ్యామల, డి.జయలక్ష్మి, జి.క్రాంతి, వి.మాణిక్యం, డి.సుశీల, వి.దుర్గాలక్ష్మి పాల్గొన్నారు.

➡️