క్వారీ బతుకులు గల్లంతు

Mar 10,2024 21:38

ప్రజాశక్తి – జామి : జిల్లాలో క్వారీ కార్మికులకు ఉపాధి గల్లంతు అవుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రయివేటు విధానంతో క్వారీ కార్మికుల ఉపాధికి తీవ్ర ముప్పు వాటిల్లింది. ఇప్పటికే జామి మండల కేంద్రంలోని క్వారీలపై ఆధార పడి బతుకుతున్న సుమారుగా 500కు పైగా దళిత కుటుంబాaఱ రోడ్డున పడ్డాయి. తాతaఱ తండ్రుల నుంచి క్వారీలనే నమ్ముకుని జీవిస్తున్న క్వారీ బతుకులు ఒక్కసారికి కనుమరుగు అవుతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వలసలు పోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. జామి గ్రామంలోనే కాదు… జిల్లాలో వేపాడ, వావిలపాడు, బొద్దాం, సోంపురం, ఆలుగుబిల్లితోపాటు జిల్లా వ్యాప్తంగా క్వారీలు మూతబడి వాటిపై ఆధారపడ్డ స్టోన్‌ క్రషర్లు మూసేశారు. ఫలితంగా కార్మికులు, డ్రైవర్లు, హెల్పర్లు వంటి అనేక రకాల పనులపై తీవ్ర ప్రభావం పడింది.జిల్లాలో రోడ్డు మెటల్‌ క్వారీలు సంక్షోభంలో ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వ మైనింగ్‌ విధానంతో సగానికి పైగా మూతబడ్డాయి. ఈ తరుణంలోనే గతేడాది జూలై నుంచి రాయల్టీ ప్రయివేటు విధానంతో ఉన్న వారి బతుకులు రోడ్డున పడ్డాయి. జామి మండల కేంద్రంలో మాధవరాయమెట్ట వద్ద క్వారీ కార్మికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉండేవి. జామి గ్రామంలో ఒక్క దళిత కాలనీ నుంచి 100 కుటుంబాలకు పైగా సొసైటీ క్వారీలో పనులు చేసుకుని దశాబ్దాల నుంచి జీవనం సాగిస్తున్నారు. క్వారీ పనులు తప్ప మరే పనులు తెలియని దళిత కుటుంబాలకు ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రయివేటు విధానం పొట్ట కొట్టింది. దీంతో కార్మిక కుటుంబాలు చెల్లాచెదురైపోయిన పరిస్థితి నెలకొంది. కుటుంబం గడవక, ఇతర ఉపాధి మార్గాల కోసం వలసలు పోయేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. జామి దళిత కాలనీలోనే వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నట్లు కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. క్వారీ కార్మికులతో ఏర్పడ్డ మాధవరాయమెట్ట కాలనీ వాసులు ఇప్పటికే క్వారీ పనులు వదులుకుని, ఇతర పనులకు మరలిపోయారు. ఉన్న కొద్దిపాటి కార్మికులు కూడా అనారోగ్యంతో పూట గడవడం కోసం, పడరాని పాట్లు పడుతున్నారు. ఇలా ఒకప్పుడు కళకళలాడిన క్వారీలన్నీ నేడు వెలవెలబోతున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా క్వారీల ఆవాసాలను పరిశీలిస్తే, కార్మికుల దుర్భర పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు.

➡️