జిల్లాలో 1897 పోలింగ్‌ కేంద్రాలు

Feb 23,2024 21:02

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో మొత్తం 1897 పోలింగ్‌ కేంద్రాలు, రెండు కౌంటింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సిఇఒ ముఖేష్‌ కుమార్‌ మీనా శుక్రవారం వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 1847, సాలూరు నియోజకవర్గం పరిధిలోని మెంటాడ మండలంలో 50.. మొత్తం 1897 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, ర్యాంపులు తదితర కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. ఓట్ల లెక్కింపు కోసం లెండి ఇంజనీరింగ్‌ కళాశాల, సెంచూరియన్‌ విశ్వవిద్యాలయ భవనాలను పరిశీలించి, ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి ఫారం- 6,7,8 పురోగతిని కలెక్టర్‌ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, తదితరులు పాల్గొన్నారు.

➡️