నగరంలో పండగ శోభ

Jan 13,2024 20:08

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తెలుగువారి ప్రధాన పండగ అయిన సంక్రాంతి శోభ విజయనగరంలో నెలకొంది. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా కుటుంబ సమేతంగా జరుపుకునే పండగ కావడంతో విజయనగరంలో మార్కెట్‌ జిల్లా నలుమూలల నుంచి ప్రజలతో కిక్కిరిసి పోయింది. నూతన వస్త్రాలు, పండగకు పిండి వంటలకు కావాల్సిన సరుకుల కొనుగోలు కోసం వచ్చిన జనాలతో నగరం శనివారం కిట కిట లాడింది. ప్రధానంగా కొత్త బట్టలు కొనుగోలు చేసేందుకు నగరంలోని ప్రజలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వేలాది మందితో బట్టల షాపులన్నీ కిటకిటలాడాయి. మూడు లాంతర్లు నుంచి ఎమ్‌జి రోడ్డు, కన్యకాపరమేశ్వరి కోవెల వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులు కొనుగోలుదారులతో నిండి పోయాయి. దీంతో నగరంలో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రధానంగా గంటస్తంభం వైపు ట్రాఫిక్‌ను నియంత్రణ చేయడంలో పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో మార్కెట్‌ లోకి ద్విచక్ర వాహనాల తప్ప పెద్ద వాహనాలు ,ఆటోలు, కార్లు వెళ్లకుండా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

➡️