నష్టం అంచనాకు ని’బంధనాలు’

విజయనగరం మండలం చిల్లపేటలో నీటమునిగిన వరిచేను ఆరబెట్టేందుకు తీసుకెళ్తున్న రైతు (ఫైల్‌)

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వ నిబంధనలు గుదిబండగా మారాయి. 5ఎకరాల లోపు గల రైతులకు మాత్రమే నష్టపరిహారం ఇస్తామని మెలికపెట్టింది. ఇందులోనూ ఎకరా విస్తీర్ణంలో 33శాతం నష్టం జరిగితేనే పరిహారానికి ఎంపిక చేయాలని మరో నిబంధన పెట్టారు. ఆ పంట కూడా ఇ-క్రాప్‌లో నమోదై ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారట. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఎజిసి02-26025 పేరిట ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిబంధనల ప్రకారం చాలా మంది రైతులకు నష్టపరిహారం అందే పరిస్థితి లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిచౌంగ్‌ తుపాను కారణంగా ఈనెల 4 నుంచి నుంచి 6వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో వివిధ పంటనష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోసిన పంట పొలాల్లోనే నీట మునిగిపోయింది. వరి దిబ్బలు కూడా సుమారు నాలుగు రోజులపాటు జలద్భిందంలో ఉండిపోయాయి. కోతలు పూర్తికాని చోట చాలా వరకు వరి చేను నేలకు ఒరిగిపోవడం, నీటిలో మునిగిపోవడం, మట్టి, ఇసుక మేటలకు గురికావడం వంటి రూపాల్లో నష్టపోయారు. కోసిన వరి పంటకు పరిహారం చెల్లించే ప్రశక్తే లేదని ఇటీవల సాక్షాత్తు రాష్ట్ర మంత్రులే స్పష్టం చేశారు. దీంతో, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మునిగిపోయిన, నేలకొరిగిన, ఇసుక మేటకు గురైన చేనుకు మాత్రమే పరిహారం చెల్లించేందుకు అనుగుణంగా మాత్రమే ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కోసిన పంటలో రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఈనెల మొదటి వారంలోనే ఎక్కువగా వరి కోతలు అయ్యాయి. వీటిలోను ఎక్కువ భాగం పొలాల్లోనే ఉండిపోయాయి. ఈలోపు వచ్చిన తుపాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. విజయనగరం జిల్లాలో 2.40లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా 1.60లక్షల ఎకరాల్లో తుపాను ముందు రోజునాటికి కోతలు పూర్తయ్యాయి. ఇందులో దాదాపు లక్ష ఎకరాల్లో వరి చేను పొలాల్లోనే ఉండిపోయింది. వొవులన్నీ వర్షపునీటిలో తేలియాడాయి. వరి దిబ్బలైతే మొకాళ్ల లోతులో మునిగిపోయాయి. ఇప్పటికీ అక్కడకక్కడా జలదిగ్భందంలోనే ఉన్నాయి. రెండు రోజులుగా వరి దిబ్బలను ఇరగదీసి ఆరబెట్టేందుకు ప్రయత్నిస్తున్న రైతులు óధాన్యం ముక్కుపోవడం, రంగుమారిపోవడం, మొలకెత్తడం వంటి పరిస్థితులను చవి చూస్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. వీటిని కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ గత అనుభవాల దృష్ట్యా న్యాయం జరిగే పరిస్థితి లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక కొతకోయకుండా మిగిలిన పంట నష్టాన్ని మాత్రమే ప్రభుత్వం గుర్తించనుంది. రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది సంయుక్తంగా పంటనష్టాన్ని గుర్తించాలని ప్రభుత్వ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకోసం గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిల్లో ప్రత్యేక బృందాలను కలెక్టర్‌ ఆధ్వర్యాన తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈనెల 18వ తేదీ నాటికి నష్టగణన పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఆ తేదీనాటికి తయారు చేసిన రైతుల జాబితాను సామాజిక ఆడిట్‌ కోసం ఆర్‌బికెల్లో ప్రదర్శనకు పెట్టనున్నారు. 22వ తేదీ వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. వీటన్నింటినీ పరిష్కరించి 26వ తేదీన నాటికి ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం కలెక్టర్‌ ఆధ్వర్యాన ప్రభుత్వానికి ప్రభుత్వానికి పంపాల్సి వుంటుంది. వీటిని పంపడానికి ముందు విస్తీర్ణం, జరిగిన నష్టం, ఇ-క్రాప్‌ నమోదు తదితర అంశాలను పున:పరిశీలించాలని కూడా స్పష్టం చేసింది.

➡️