నిండు జీవితానికి రెండు చుక్కలు

Mar 1,2024 20:27

ప్రజాశక్తి-విజయనగరంకోట : ఈనెల 3న జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్లలోపు పిల్లందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని కోరారు. పోలియో వ్యాధిని రూపుమాపేందుకు పోలియో చుక్కలు వేయించడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు సుమారు 1,98,478 మంది ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కలను వేయడానికి 1,182 బూత్‌లను ఏర్పాటు చేస్తున్నామని డిఎంఅండ్‌హెచ్‌ఒ తెలిపారు. సుమారు 5వేల మంది ఈ కార్యక్రమంలో విధులను నిర్వహించడానికి సిద్దమయ్యారని, 2,450 బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని 192 మంది సూపర్‌వైజర్లు, 66 మొబైల్‌ బృందాలు, 20 ట్రాన్సిట్‌ బృందాలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. జిల్లాలో 56 కోల్డ్‌ చైన్‌ పాయింట్లను ఏర్పాటు చేశామని, 3,12,000 డోసులను సిద్దం చేశామని చెప్పారు. జిల్లాలో 1999లో చివరిసారిగా రెండు పోలియో కేసులు నమోదయ్యాయని, అప్పటినుంచి నేటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడానికి కారణం, పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయించి ప్రజలు సహకరించడమే కారణమని ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నుంచి పల్స్‌ పోలియోపై అవగాహనా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ రాణి, జిల్లా టీకాధికారి డాక్టర్‌ అచ్చుతకుమారి పాల్గొన్నారు.

➡️