నిర్బంధాలు…అరెస్టులపై అంగన్వాడీల ఆగ్రహం

Jan 22,2024 20:56

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సమస్యలు పరిష్కరించాలని కోటి సంతకాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వద్ద మొరపెట్టుకునేందుకు విజయవాడ బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు చేసి నిర్భందించడాన్ని నిరసిస్తూ అంగన్వాడీలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా సోమవారం రాస్తారోకోలు చేశారు. కలెక్టరేట్‌ వద్ద సిఐటియు, ఇఫ్టూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేతులకు సంకెళ్లతో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక ,ప్రజాసంఘాల నాయకులు రెడ్డి శంకర్రావు, ఎ.జగన్మోహన్‌, బి.సుధారాణి, పి.రామ్మోహన్‌, పి. రమణమ్మ, బి.రమణ, అప్పలసూరి మాట్లాడారు. 42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను పరిష్కరించకుండా, అత్యంత దుర్మార్గంగా విజయవాడ వెళ్లనివ్వకుండా నిర్బంధించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోవైపు కలెక్టర్‌ విధులకు హాజరు కాకపోతే తొలగిస్తున్నామని ప్రకటించడం దుర్మార్గమని, వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింప చేయకపోతే కార్మిక, ప్రజా,విద్యార్థి, మహిళ, ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను కలుపుకొని రాష్ట్రాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వెంకటేష్‌, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు హరీష్‌, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు .డెంకాడ : భోగాపురం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలో డెంకాడ, భోగాపురం మండలాల నుంచి విజయవాడ బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఆదివారం రాత్రి 2గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అదుపులోకి తీసుకున్న వీరిని డెంకాడ స్టేషన్‌ వద్దకు తీసుకొచ్చారు. సోమవారం ఉదయం దీరంతా స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. కొత్తవలస : ప్రభుత్వం మొండివైఖరి వీడాలని కొత్తవలస జంక్షన్‌, పోలీస్‌స్టేషన్‌ వద్ద సోమవారం అంగన్వాడీలు రాస్తారోకో చేపట్టారు. వీరికి సిపిఎం నాయకులు జి.అప్పారావు, సిహెచ్‌ జగన్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీలు పాల్గొన్నారు.శృంగవరపుకోట : అంగన్వాడీల అక్రమ అరెస్టులకు నిరసనగా పట్టణంలోని దేవి కూడలిలో అంగన్వాడీలు రాస్తారోకో నిర్వహించారు. తొలుత పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం నుంచి ఆర్‌టిసి కాంప్లెక్సు వరకు ర్యాలీ చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, జిల్లా కమిటీ సభ్యులు చెలికాని ముత్యాలు గిరిజన సంఘం డివిజన్‌ నాయకులు జె.గౌరీష్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు డి.జయలక్ష్మి, దంతేశ్వరి, కె.సుశీల పాల్గొన్నారు.గజపతినగరం : అంగన్వాడీల అరెస్టులను నిరసిస్తూ స్థానిక నాలుగు రోడల కూడలిలో రాస్తారోకో చేపట్టారు. తొలుత ఆర్‌టిసి కాంప్లెక్సు నుంచి ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షులు సుభాషిణి, సెక్టార్‌ లీడర్లు దమయంతి, రాములమ్మ, రమణమ్మ, నాగమణి, వాణి, త్రివేణి, జ్యోతి, సన్యాసమ్మ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
అంగన్వాడీల తొలగింపు అన్యాయం
వైసిపి ప్రభుత్వం అంగన్వాడీలను విధుల నుంచి తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టడం అన్యాయమని జనసేన నాయకులు గురాన అయ్యలు మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అంగన్వాడీల తొలగింపు ఉత్తర్వులను ఖండించారు. సిఎం జగన్‌ నియంతృత్వ పోకడలకు అద్దంపడుతోందని విమర్శించారు. 42 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికంగా ఉందని ఆయన మండిపడ్డారు. అంగన్‌వాడీలకు అండగా ఉంటామన్నారు. అంగన్వాడీల కన్నీటిలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు.

➡️