పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు

Jan 24,2024 21:25

ప్రజాశక్తి-రాజాం, చీపురుపల్లి, గరివిడి : అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం పోలింగ్‌ కేంద్రాలుగా వినియోగించే భవనాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపు, విద్యుత్తు సదుపాయం, ఫర్నీచర్‌, సరైన నేమ్‌ బోర్డులు తదితర ఆరు అంశాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ఈ మేరకు జిల్లాలోని పలు మండలాల్లో ఆమె బుధవారం పర్యటించారు. రాజాం మున్సిపాలిటీ పరిధిలోని వస్త్రపురి కాలనీలో, బొద్దాం గ్రామంలో పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. వసతులపై ఆరాతీశారు. కులగణన సర్వేను తనిఖీ చేశారు. వాలంటీర్లతో మాట్లాడి, సర్వే ప్రక్రియపై ఆరా తీశారు. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో తనిఖీ చేశారు. కార్డుల పంపిణీ నెమ్మదిగా జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా అవకాశం ఉందని, కొత్తవారిని కూడా జత చేయవచ్చని సూచించారు. చీపురుపల్లి పట్టణంలో శివరాం రోడ్డులో నాలుగో సచివాలయ పరిధిలో నిర్వహిస్తున్న కులగణన, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని పరిశీలించారు. విజయరాంపురం ఎంపిపి పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. గరివిడి మండలం కోడూరు ఎంపిపి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లోని వసతులను పరిశీలించారు. బిఎల్‌ఒలతో మాట్లాడారు. కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ ఇఆర్‌ఒ సుధారాణి, ఆర్‌డిఒ బి.శాంతకుమారి, కులగణన జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ కె.సందీప్‌ కుమార్‌, తహశీల్దార్లు తాడ్డి గోవింద, సురేష్‌, ఎంపిడిఒ జి.గిరిబాల, తదితరులు పాల్గొన్నారు.

➡️