ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం

ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయలను పరిశీలిస్తున్న కలెక్టర్‌, జెసి

ప్రజాశక్తి-వేపాడ : జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి కోరారు. వేపాడ మండల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సేంద్రీయ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలైనవని చెప్పారు. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. వేపాడ మండలం ప్రకృతి వ్యవసాయానికి ఎంతో అనువుగా ఉంది. మండలంలోని సుమారు 13 గ్రామాల్లో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగవుతోంది. సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరగాయలు, ఆకు కూరలను మండల కేంద్రంలో ప్రతీ సోమవారం ప్రత్యేక కేంద్రం ద్వారా విక్రయిస్తున్నారు. ఈ శిబిరంలో ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండించిన ఆరు రకాల కూరగాయలు, ఆకు కూరలు, ములగ కాడలు, అరటిగెలలు, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, చిరుధాన్య ఉత్తుత్తులను విక్రయానికి ఉంచారు. మండలంలో సుమారు 20 సెంట్లలో 365 రోజులూ ఆదాయం వచ్చే విధంగా చేస్తున్న ప్రకృతి వ్యవసాయ నమూనాను కలెక్టర్‌ తిలకించి, ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. నిరంతరం ఆదాయం వచ్చే ఎ-గ్రేడ్‌ మోడల్‌ విధానంలో ఎకరానికి ఏడాదికి సుమారు రూ.2 లక్షల వరకు ఆదాయం సంపాదించవచ్చునని వ్యవసాయ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డిసిసిబి చైర్మన్‌ వేచలపు వెంకట చినరామునాయుడు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విటి రామారావు, ఉద్యాన శాఖాధికారి జమదగ్ని, ఎపిసిఎన్‌ఎఫ్‌ జిల్లా మేనేజర్‌ ఆనందరావు, ఎంపిపి దొగ్గ సత్యవంతుడు, జెడ్‌పిటిసి ఎస్‌.అప్పలనాయుడు, ఎంపిడిఒ బిఎస్‌కెఎన్‌ పట్నాయక్‌, తహశీల్దార్‌ ప్రసన్నకుమార్‌, సిఎన్‌ఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు.జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలి జీవవైవిధ్యాన్ని పెంపొందించడం ద్వారా భూసారాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ కోరారు. ఎస్‌ఎబిఎఎల్‌ ప్రాజెక్టులో భాగంగా జీవ వైవిధ్యభరిత వ్యవసాయ విధానాలు, సుస్థిర భూ వనరుల యాజమాన్య కార్యక్రమం గురించి సంబంధిత అధికారులు, రైతులతో మోడల్‌ మండలంలోని కెజి పూడి గ్రామంలో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జెసి అశోక్‌ మాట్లాడుతూ కెజిపూడి పంచాయతీలోని 9 గ్రామాల్లో సుమారు 4250 ఎకరాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. జీవవైవిధ్యాన్ని పెంపొందించడం, క్షీణిస్తున్న భూములను పునరుద్ధరించడం, ప్రకృతి వ్యవసాయ రైతులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం లక్ష్యాలని తెలిపారు. వ్యక్తిగత, ఉమ్మడి భూములతోపాటు అటవీభూముల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు, తమ ఉత్పత్తులకు ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ చేయించి, ఎక్కువ ధరకు విక్రయించుకొనేందుకు అవకాశాన్ని కల్పించాలని జెసి సూచించారు. ఆర్‌వైఎస్‌ఎస్‌ డిపిఎం ఎ.ఆనందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రీజనల్‌ కోఆర్డినేటర్‌ వెంకటరావు, సిఎస్‌ఎ సిబ్బంది పాల్గొన్నారు.

➡️