మధ్యాహ్న భోజన కార్మికులపై వైసిపి దాష్టీకం

Mar 7,2024 20:07

ప్రజాశక్తి – జామి : మధ్యాహ్న బోజన నిర్వాహకులపై వైసిపి నాయకులు దాష్టీకానికి తెగబడిన ఉదంతమిది. మండలంలోని అన్నంరాజుపేట గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. 20 ఏళ్లుగా పని చేస్తున్న నిర్వాహకులపై వైసిపి నాయకులు దాడి చేయడంతో పాటు ఏకంగా అడ్డగోలుగా తొలగించారు. అధికార అండతో వైసిపి పెత్తనం చేస్తున్నా, ఇటు పోలీసులు, అటు విద్యాశాఖాధికారులు కిమ్మనకపోవడం గమనార్హం. దాడి జరిగి, జిల్లా కేంద్రాసుపత్రిలో ఎమ్మెల్సీ జరిగినా, పోలీసులు కేసు నమోదు చేయకుండా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం బాధితులు ఎంఇఒ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి, అధికారులకు వినతి పత్రం అందజేశారు. మండలంలోని అన్నంరాజుపేట గ్రామంలో మోసాడ లక్ష్మి, ఎన్నింటి లక్ష్మి.. 20 ఏళ్లుగా మధ్యాహ్న భోజన నిర్వాహకులుగా పని చేస్తున్నారు. అయితే గత వేసవి సెలవుల్లో ఎన్నింటి లక్ష్మి చనిపోవడంతో ఆ స్థానంలో ఎన్నింటి సుజాతను నియమించారు. వైసిపి అధికారం చేపట్టిన తర్వాత తాలాడ పైడిరాజు అనే మరో మహిళను నియమించారు. అప్పటి నుంచి ఏదో విధంగా ముందు నుంచీ ఉన్న నిర్వాహకులను తొలగించాలని వైసిపి పన్నాగం పన్నుతూ వచ్చింది. చివరికి గత నెల 29న మోసాడ లక్ష్మి, పైడిరాజు మధ్య చిన్న తగాదా చోటుచేసుకుంది. దీంతో పైడిరాజు భర్త ఆ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌గా ఉండడంతో దౌర్జన్యంగా మరో వ్యక్తితో కలిసి పాఠశాలలోకి నేరుగా వచ్చి, మహిళ అని చూడకుండా దాడికి తెగబడిన ఘటన అందరినీ కలచివేసింది. దీంతో మోసాడ లక్ష్మి 108 వాహనంలో జిల్లా కేంద్రాసుపత్రిలో చేరి, వైద్యం తీసుకుని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. 100కు డయల్‌ చేసి పోలీసులకు తమపై జరిగిన దాడిని వివరించారు. ఆస్పత్రి నుంచి వచ్చి పోలీసులను నేరుగా కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదూ అందజేశారు. కానీ అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు చూసీచూడనట్లు వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
పొట్ట మీద కొట్టారు
దాడి చేయడంతో ఆగని అధికార పార్టీ నాయకులు వారిని ఏకంగా విధుల నుంచి తొలగించించారు. ఇక నుంచి పాఠశాలకు రావద్దని చెప్పినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు అధికారపార్టీతో కుమ్మక్కై, తమను అన్యాయంగా తొలగింపు చర్యలకు దిగడం ఎంతవరకు సబబని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తొలగింపు చర్యలు ఆపడంతోపాటు తమపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిరుపేదలమైన తమపై అధికార పార్టీ పెద్దలు ఇంతటి దాష్టీకానికి దిగడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
తొలగింపు విషయం తెలియదు
మధ్యాహ్న భోజన ఏజెన్సీ వివాదంపై ఇరువురికి సర్ది చెప్పాం. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు నిర్వాహకులను తొలగించిన విషయం తెలియదు. – గంగరాజు, ఎంఇఒ- 2, జామి

➡️