మారుమూల ప్రాంతాల్లో మొబైల్‌ టవర్లు

Mar 1,2024 20:24

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో వివిధ టెలికాం సంస్థల ద్వారా మొబైల్‌ సిగల్స్‌ అందని మారుమూల ప్రాంతాల్లో సెల్‌ టవర్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి టెలికాం సంస్థల ప్రతినిధులను కోరారు. ప్రభుత్వ పరంగా టవర్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు సత్వరమే మంజూరుచేసి సహకరిస్తామన్నారు. ముఖ్యంగా ఎస్‌.కోట, రామభద్రపురం, గంట్యాడ తదితర మండలాల్లోని మారమూల గిరిజన ప్రాంతాలకు మొబైల్‌ సేవలు అందడం లేదని, ఈ ప్రాంతాల్లో మొబైల్‌ నెట్‌వర్క్‌ లేని గ్రామాలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని టెలికాం సంస్థలు ముందుకు వచ్చి టవర్లు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లతో కలెక్టర్‌ శుక్రవారం తన ఛాంబరులో టెలిఫోన్‌ టవర్ల ఏర్పాటు, వాటికి అనుమతుల మంజూరుపై సమీక్షించారు. రామభద్రపురం మండలం ఎనుబరువు, ఎస్‌.కోట మండలం పల్లపు దుంగాడ, గంట్యాడ మండలం డి.కె.పర్తి తదితర ప్రాంతాల్లో టెలికాం సిగల్స్‌ అందడం లేదని, రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ గ్రామాల్లో వెంటనే టవర్లు ఏర్పాటు చేయాలని కోరారు. మార్చి నెలాఖరులోగా ఎస్‌.కోట, గంట్యాడ, రామభద్రపురం మండలంలోని గ్రామాల్లో బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌., రిలయన్స్‌ జియో సంస్థల్లో ఏ సంస్థ ద్వారా అవకాశం వుంటే వారితో ఏర్పాటు చేస్తామని ఆయా సంస్థల ప్రతినిధులు హామీ ఇచ్చారు. రామభద్రపురం మండలం రావివలస గ్రామం మైదాన ప్రాంతంలో వున్నప్పటికీ ఇక్కడ కూడా మొబైల్‌ సిగల్స్‌ రావడం లేదని, అక్కడ ఏ సంస్థ ద్వారా మొబైల్‌ సేవలు అందించేందుకు అవకాశం వుందో పరిశీలించాలని కలెక్టర్‌ చెప్పారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, కలెక్టర్‌ కార్యాలయ ఎన్నికల విభాగం తహశీల్దార్‌ ప్రభాకరరావు, బిఎస్‌ఎన్‌ఎల్‌ జియో టెలికాం సంస్థల ప్రతినిధులు, ఫైబర్‌నెట్‌ ప్రతినిధి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️