రెవెన్యూ ఉద్యోగుల నిరసన

Feb 3,2024 18:49

ప్రజాశక్తి-విజయనగరం: బొండపల్లి తహశీల్దార్‌ శనపల రమణయ్య హత్యను రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. విశాఖపట్నం రూరల్‌ తహశీల్దార్‌గా పనిచేసిన రమణయ్య… ఎన్నికల బదిలీల్లో భాగంగా శుక్రవారమే జిల్లాలో బొండపల్లి మండలం తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన ఆయన కొమ్మాదిలో హత్యకు గురయ్యారు. ఈ హత్యకు వ్యతిరేకంగా కలెక్టరేట్‌ పోర్టికో వద్ద శనివారం రెవెన్యూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులపై దాడులను అరికట్టాలని, వారు స్వేచ్ఛగా పనిచేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలని, ఈ హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల భద్రత కోసం తగిన చట్టాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముందుగా రమణయ్య మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ.సూర్య, కలెక్టరేట్‌ యూనిట్‌ నాయకులు, సర్వేశాఖ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

➡️