వైసిపిలోకి వరహాలునాయుడు

Feb 22,2024 20:41

ప్రజాశక్తి-చీపురుపల్లి : జెడ్‌పిటిసి మాజీ సభ్యులు మీసాల వరహాలనాయుడు వైసిపి పార్టీలోకి వెల్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు చీపురుపల్లి పంచాయతీ పరిధిలో తన వర్గంతో ఈనెల 21న సమావేశం ఏర్పాటు చేసిన వరహాలునాయుడు మంత్రి బొత్స సమక్షంలో వైసిపి తీర్ధం పుచ్చుకునేందుకు అందరం సమాయత్తం కావాలని తన గ్రూపు నాయకులకు చెప్పినట్లు తెలిసింది. ఈనెల 26న స్థానిక మూడు రోడ్లు కూడలి వద్ద ఏర్పాటు చేయనున్న సభలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యన్నారాయణ సమంక్షంలో పెద్ద ఎత్తున కార్యకర్తలతో చేరేందుకు నిర్ణయించుకున్నారు. రాజకీయాలు తెలిసినప్పటి నుండి వరహాలనాయుడు బెల్లాన సింహాచలంతో కలసి పని చేసారు. అనంతరం ప్రస్తుత ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌కు కుడిభుజంగా ఉంటూ మీసాల వరహాలనాయుడు బెల్లాన కుటుంబం పోటీ చేసినప్పుడల్లా తానే అన్ని అయి చూసుకునే వారు. అనంతరం బొత్స సత్యన్నారాయణ ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు బెల్లాన చంద్రశేఖర్‌, మీసాల వరహాలనాయుడులు బొత్స గెలుపునకు కృషి చేసారు. ఈ క్రమంలో 2012లో రామలింగాపురం సొసైటీ అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు నల్లా నాగేశ్వరరావుకు సొసైటీ అధ్యక్ష పదవి ఇవ్వాలని వరహాలనాయుడు, బెల్లాన త్రినాధ్‌కు ఇవ్వాలని బెల్లాన చంద్రశేఖర్‌లు పట్టుబడడంతో వరహాలనాయుడుకు, బెల్లాన చంద్రశేఖర్‌కు మధ్య విబేధాలు మొదలయ్యాయి. దీంతో వీరిద్దరూ ఎడమొహం పెడమొహంతో బొత్స సత్యన్నారాయణకు తలనొప్పిగా తయారయ్యారు. ఈనేపథ్యంలో వరహాలనాయుడు ఏ పనికెల్లినా బెల్లాన చంద్రశేఖర్‌ అడ్డు వస్తున్నారనే నెపంతో 2013లో చీపురుపల్లి మేజర్‌ పంచాయతీకి ఇండిపెండెంట్‌గా తన సతీమణి మీసాల సరోజినిని సర్పంచ్‌ అభ్యర్థిగా నిలబెట్టి సుమారు 5 వేల 750 ఓట్లు మెజారిటీతో గెలిపించుకున్నారు. 20 వార్డులకు గాను 18 వార్డు మెంబర్లను వరహాలనాయుడు గెలుచుకున్నాడు. 2014లో మీసాల వరహాలనాయుడు తెలుగుదేశం పార్టీలో తన అనుచర గణంతో చేరారు. ఆ పార్టీ తరుపున జడ్‌పిటిసిగా పోటీ చేసిన వరహాలనాయుడు సుమారు 7 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆ పార్టీలో ఎంతో కాలం నిలవలేక నాయకులతో విబేధాలు వచ్చి పార్టీకి అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. టిడిపి కూడా వరహాలనాయుడును పట్టించుకోకపోవడంతో తిరిగి మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో తన అనుచర గణంతో వైసిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు.

➡️