శ్రమజీవికి రైతే ఆదర్శం

Jan 28,2024 21:38

ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రతీ శ్రమజీవికి రైతే ఆదర్శమని పల్సస్‌ గ్రూప్‌ సిఇఒ డాక్టర్‌ గేదెల శ్రీనుబాబు తెలిపారు. ఉత్తరాంధ్రలో రైతు సదస్సులు నిర్వహిస్తున్న ఆయన ఆదివారం విజయనగరం చేరుకున్నారు. ఈ సందర్భంగా వై జంక్షన్‌ వద్ద రైతులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎడ్లబండ్లపై ఊరేగిస్తూ స్థానిక మొసానిక్‌ టెంపుల్‌ వద్ద ఏర్పాటు చేసిన సదస్సు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర నుంచి గత మూడు దశాబ్దాల్లో 30 లక్షల మంది వలస వెళ్లిపోయారన్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడమే అందుకు కారణమని తెలిపారు. ఇక్కడ ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోలేకపోవడం వల్ల ఆ పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లాలో 10 లక్షల ఎకరాల భూమి సాగుకు అనువైనదన్నారు. కానీ ఆరున్నర లక్షల ఎకరాలు మాత్రమే రైతులు సాగు చేస్తుంటే, అందులో నాలుగున్నర లక్షలకు వర్షాలే ఆధారమన్నారు. ఏటా 20 వేల మంది పట్టభద్రులు వస్తుంటే, వెయ్యి మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సుస్థిర వ్యవసాయ, ఆర్థిక కారిడార్లు నిర్మించి, రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర తీసుకురావడం కోసం తమ పల్సస్‌ కంపెనీ మద్దతునిస్తుందన్నారు. ప్రస్తుతం తాను దాదాపు 5 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతూ వ్యాపారవేత్తగా మారే అవకాశం ఉందన్నారు. వలసలను నిరోధించి ప్రతి వ్యక్తికీ ఉపాధి కల్పించడమే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మామిడి శ్రీకాంత్‌, లంక గాంధీ, ఇజ్జాపు శ్రీను, రామకృష్ణ, ఆదర్శ రైతు శిరివూరి ఆంజనేయరాజు, అప్పారావు, రొంగలి రామారావు పాల్గొన్నారు.

➡️