సంబరానికి వేళాయే

Jan 22,2024 20:59

ప్రజాశక్తి – మక్కువ : రాష్ట్ర గిరిజన దేవత జాతరగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ అమ్మవారి సినిమా నోత్సవం మంగళవారం జరగ నుంది. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమయ్యే సినిమానోత్సవానికి ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ పర్యవేక్షణలో సుమారు 650 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ ఇఒ వివి సూర్యనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. సాలూరు, పార్వతీపురం, విజయనగరం, పాలకొండ ఆర్‌టిసి డిపోల నుంచి సుమారు 170 బస్సులు ప్రత్యేకంగా శంబరకు నడపనున్నారు. ఇందుకోసం వనంగుడి వద్ద సాలూరు వైపు నుండే వచ్చేబస్సులను, జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ వద్ద మక్కువ వైపు నుండి వచ్చే బస్సులను నిలపనున్నారు.నిఘా నీడలో శంబర సినిమానోత్సం నేపథ్యంలో పటిష్ట నిఘాను ఏర్పాటు చేసినట్లు ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో తమ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. డ్రోన్‌, సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. అసాంఘిక శక్తులకు, అల్లర్లకు ఎలాంటి ఆస్కారం లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. క్రైమ్‌ టీం, షీ టీంలతో పాటు మఫ్టీలో పోలీసులు విధులు నిర్వహిస్తారన్నారు. మక్కువ ప్రధాన రహదారి జంక్షన్‌ నుంచి ట్రాఫిక్‌ను రెండు విధాలా మళ్లిస్తున్నట్టు తెలిపారు. చెముడు మీదుగా మూడు, నాలుగు చక్రాల వాహనాలకు, , కవిరపల్లి మీదుగా ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. సిరిమాను ఊరేగింపు సమయంలో రోప్‌ పార్టీ బందోబస్తు ఉంటుందన్నారు. మూడుచోట్ల ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేశామన్నారు. జాతర సందర్భంగా గ్రామంలోని అమ్మవారి ఆలయాల వద్ద ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరాకు ఆ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది.

➡️