‘సిసి’ నీడలో ఇంటర్‌ పరీక్షలు

Feb 18,2024 20:58

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ‘మార్చి ఒకటో తేదీ నుంచి జరిగే ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసుకునేలా పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశాం. ఈ ఏడాది సిసి కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నామ’ని ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం.ఆదినారాయణ తెలిపారు. ఈ వారం తనను కలిసిన ‘ప్రజాశక్తి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల నేపథ్యంలో పరీక్షల ఏర్పాట్లు, నిర్వహణపై పలు విషయాలను ఆయన వివరించారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు…
ఇంటర్‌ పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి.?
ఇంటర్‌ మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి 23 తేదీ వరకు జరగనున్నాయి . ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 8.30 గంటలకు చేరుకోవాలి.
ఈ ఏడాది ఎంతమంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.?
ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు 20,630 మంది హాజరు కానున్నారు. వారిలో బాలురు 9891 మంది, బాలికలు 10,739 మంది ఉన్నారు. మొత్తం విద్యార్థుల్లో జనరల్‌ -17,031 మంది, ఒకేషనల్‌ – 3599 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 25,134 మంది హాజరు కానున్నారు. వీరిలో బాలురు 11,872 మంది, బాలికలు 13,262 మంది ఉన్నారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 20,896, ఒకేషనల్‌ విద్యార్థులు 4238 మంది ఉన్నారు.
ఇంటర్‌ పరీక్షలు ఎన్ని కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు? సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారా.?
ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 73 కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం. వాటిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 17, సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాలు 4, ఎపిఆర్‌జెసి 1, మోడల్‌ పాఠశాలలు 4, ప్రయివేట్‌ జూనియర్‌ కళాశాలలు 48 కేంద్రాల్లో పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. ఎటువంటి సమస్యాత్మక కేంద్రాలూ లేవు. అన్ని కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశాం.
విద్యార్థులకు రవాణా సౌకర్యం కోసం తీసుకున్న చర్యలేమిటి.?
పరీక్షలు రాసేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలి. అందుకోసం ఎపిఎస్‌ఆర్‌టిసి అధికారులతో మాట్లాడి ఆన్ని రూట్లలో బస్సులు ఉదయం 6 గంటల నుంచి అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. మళ్లీ పరీక్ష ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లేందుకు కూడా బస్సులు అందుబాటులో ఉంటాయ.
ఎన్ని స్టోరేజ్‌ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు.?
జిల్లాలో 73 పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలు సకాలంలో అందించేందుకు 24 స్టోరేజ్‌ పాయింట్లు, పోలీస్‌ స్టేషన్లలో ఉంచాం. వాటిని తరలించేందుకు ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశాం.
పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి సౌకర్యాలు కల్పించనున్నారు.?
73 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వెలుతురు, గాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. అన్ని కేంద్రాల్లో మెడికల్‌ సిబ్బందితోపాటు తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్‌ ఉంటాయి. ఇప్పటికే మూడు దఫాలుగా వెళ్లి పరిశీలించి అందుకు తగిన ఆదేశాలు జారీ చేశాం. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. కేంద్రాలకు దగ్గరలో షాపులు, జిరాక్స్‌ సెంటర్లు లేకుండా ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం.
పరీక్షలకు ఎంత మంది సిబ్బందిని నియమించారు.?
ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 1200 మందికి పైగా సిబ్బందిని, ఇన్విజిలేటర్లను నియమించాం. పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్‌ స్క్వాడ్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు ఉంటారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో హైపవర్‌ కమిటీ పరీక్షలను పర్యవేక్షించనుంది. పరీక్షల నిర్వహణలో ఎటువంటి సమస్యలూ లేకుండా ప్రశాంతంగా జరిగేలా వివిధ శాఖల సహకారం తీసుకుంటాం. ఆర్‌టిసి, పోలీస్‌, రెవెన్యూ, మెడికల్‌, విద్యుత్తు శాఖల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నాం.

➡️