రిసెప్షన్‌ సెంటర్ల వద్ద పక్కా ఏర్పాట్లు

Apr 21,2024 21:44

ప్రజాశక్తి-డెంకాడ, విజయనగరం కోట : రిసెప్షన్‌ సెంటర్లవద్ద అన్ని వసతులను కల్పిస్తూ, పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఆదివారం జెఎన్‌టియు గురజాడ విశ్వవిద్యాలయం, డెంకాడ మండలంలోని లెండి ఇంజనీరింగ్‌ కళాశాలలను సందర్శించారు. వాహనాల పార్కింగ్‌ కోసం పరిసర ప్రాంతాలను సైతం పరిశీలించారు. రిసెప్షన్‌ సెంటర్లు, స్ట్రాంగురూములు, బారికేడింగ్‌, పార్కింగ్‌, భోజన ఏర్పాట్లపై సమీక్షించారు. లెండి కళాశాలలో రాజాం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాలు, జెఎన్‌టియుజివిలో బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రిసెప్షన్‌ సెంటర్‌ సిబ్బందితోపాటు, పోలింగ్‌ అనంతరం ఇవిఎంలను తీసుకువచ్చే అధికారులు, సిబ్బంది రాకపోకలకు ఎక్కడా ఇబ్బంది పడకుండా కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటర్లు తగినంత విశాలంగా, పూర్తి లైటింగ్‌తో ఏర్పాటు చేయాలన్నారు. ఇవిఎంలను తీసుకొని రావడానికి, స్ట్రాంగురూములోకి తరలించడానికి, అవసరమైన పత్రాలను నింపేందుకు, అందజేసేందుకు వీలుగా కౌంటర్లు ఉండాలన్నారు. బస్సులు, అధికారుల వాహనాలు లోపలికి రావడానికి, సిబ్బందిని దించి బయటకు వెళ్లడానికి వీలుగా రెండు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేయాలని, ఎక్కడా ట్రాఫిక్‌ జామ్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రాల్లో స్పెషల్‌ కౌంటర్లు, ఆర్‌ఒ టేబుల్‌, హెల్ప్‌ డెస్క్‌, స్క్రూటినీ, మైక్రో అబ్జర్వర్‌ల కోసం కూడా కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.అధికారులకు, సిబ్బందికి వేసవిని దృష్టిలో పెట్టుకొని, అందుకు తగ్గట్టుగా భోజన సదుపాయాన్ని కల్పించాలని ఆదేశించారు. భోజనం కోసం ఎక్కడా రద్దీ ఏర్పడకుండా, తగినన్ని కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది ఇవిఎంలతో లోపలికి వచ్చిన దగ్గరనుంచి, తమకు కేటాయించిన కౌంటర్లకు సులువుగా చేరుకొనేవిధంగా, గుర్తించే విధంగా నేమ్‌ బోర్డులు, డైరెక్షన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతిచోటా మంచినీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు అనుగుణంగా ఇవిఎంల స్ట్రాంగ్‌ రూములను సిద్ధం చేయాలని, పనులు వెంటనే మొదలు పెట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.పర్యటనలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ఆర్‌డిఒ ఎంవి సూర్యకళ, ఆయా కేంద్రాల నోడల్‌ అధికారులైన మెప్మా పీడీ ఎం.సుధాకరావు, హౌసింగ్‌ పీడీి శ్రీనివాసరావు, ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి సుధారాణి, డిప్యుటీ సిఇఒ కె.రాజ్‌కుమార్‌, జెడ్‌పి సిఇఓ శ్రీధర్‌ రాజా, డిఎస్‌ఒ మధుసూదనరావు, సివిల్‌ సప్లయిస్‌ డిఎం మీనాకుమారి, పంచాయితీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️