మిమ్స్‌ ఉద్యోగుల అరెస్టు దారుణం

Apr 7,2024 21:25

ప్రజాశక్తి-నెల్లిమర్ల : తమ సమస్యల పరిష్కారం కోసం రెండు నెలలుగా పోరాటం చేస్తున్న మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులను, వారికి మద్దతుగా నిలిచిన సిఐటియు నాయకులను అరెస్టు చేయడం దారుణమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, జిల్లా నాయకులు ఎ.జగన్మోహనరావు, బి.రమణ, కె.రామారావు ఆధ్వర్యాన ఆదివారం స్థానిక థామస్‌పేట వద్ద లోకం మాధవి, టిడిపి మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌కుమార్‌ను కలిసి, మిమ్స్‌ ఉద్యోగుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా లోకం మాధవి, కడగల ఆనంద్‌ కుమార్‌ మాట్లాడుతూ మిమ్స్‌ యాజమాన్యానికి అధికార వైసిపి నేతలు తెరవెనుక ఉండి డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 300మంది మిమ్స్‌ ఉద్యోగుల ఆకలి మంటలు ప్రభుత్వానికి పట్టవా? అని మండిపడ్డారు. మహిళలను రాత్రిపూట స్టేషన్లో నిర్బంధించడాన్ని ఖండించారు. జైల్లో ఉన్న కార్మిక కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం, మహిళలని కొట్టడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఆందోళన వ్యక్తంచేశారు. మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన పోరాటానికి అండగా నిలుస్తామని ప్రకటించారు.అరెస్టులకు సిపిఎం ఖండనవిజయనగరం టౌన్‌ : మిమ్స్‌ ఉద్యోగులను, వారికి అండగా నిలిచిన సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు ఖండించారు. తక్షణమే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగుల అక్రమ అరెస్టులు దుర్మార్గమని సిఐటియు జిల్లా నాయకులు కిల్లంపల్లి రామారావు ఖండించారు. రెండు నెలలకు పైగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మిమ్స్‌ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ పోలీసులు శిబిరాన్ని తొలగించడం దారుణమని మండిపడ్డారు. అరెస్టులపై నిరసనబొబ్బిలి : అధికార పార్టీ నాయకులు అండదండలతో మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులను, సిఐటియు నాయకులను అన్యాయంగా అరెస్టులు చేశారని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, నవ్య జ్యూట్‌ మిల్లు యూనియన్‌ నాయకులు టి.సత్యారావు, చిరంజీవి ఆగ్రహం వ్యక్తంచేశారు. మిమ్స్‌ కార్మికులు, ఉద్యోగులు, సిఐటియు నాయకులు అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నవ్య జ్యూట్‌ మిల్లు వద్ద ఆదివారం నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి అక్రమ కేసులను రద్దు చేసి అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️