నేటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌

May 4,2024 21:32

 విజయనగరం జిల్లాలో 18,631 మంది ఓటర్లు

నేటి నుంచి మూడు రోజులు పాటు ఓటింగ్‌కు అవకాశం

ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌

8 వ తేదీ నుండి 10 వరకు అత్యవసర సేవల ఉద్యోగులకు..

ప్రజాశక్తి-విజయనగరం కోట  : జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆదివారం నుంచి మూడు రోజులు పాటు అధికారులు అవకాశం కల్పించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు ఈ నెల 5 నుంచి 7 వ తేదీ మధ్య ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికోసం అన్ని నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ మూడు రోజుల్లో ఉదయం 9 గంటలు నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఓటు వేయవచ్చు. జిల్లాలో పనిచేస్తూ, ఇతర జిల్లాలో ఓటు హక్కు కలిగి ఉండి, పోస్టల్‌ ఓటు కోసం ఫారం -12 ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు, తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి, విజయనగరంలోని జెఎన్‌టియు గురజాడ విశ్వ విద్యాలయంలో ప్రత్యేక ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అకడమిక్‌ బ్లాక్‌-1 , గ్రౌండ్‌ ఫ్లోర్‌ లోని 1,2,3,4,5 గదుల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం విజయనగరం నియోజకవర్గంలో ఓటు కల్గిన ఉద్యోగులు తమ పోస్టల్‌ బ్యాలెట్‌ ను వినియోగించుకోవడానికి కూడా జెఎన్‌టియు లోని అకడమిక్‌ బ్లాక్‌ -2 లో ఫెసిలిటేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. అత్యవసర (ఎసెన్షియల్‌) శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులు ఈ నెల 8 నుండి 10 వ తేదీ వరకు ఉదయం 9 గంటలు నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఓటు వేయవచ్చు. జిల్లాలో ఉంటూ ఇతర జిల్లాల్లో ఓటు కలిగిన వారి కోసం అకడమిక్‌ బ్లాక్‌-1 , గ్రౌండ్‌ ఫ్లోర్‌ లోని 1,2,3,4,5 గదుల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం విజయనగరం నియోజకవర్గంలో ఓటు కలిగిన ఉద్యోగులు తమ పోస్టల్‌ బ్యాలెట్‌ ను వినియోగించుకోవడానికి కూడా జెఎన్‌టియులోని అకడమిక్‌ బ్లాక్‌ -2 లో ఫెసిలిటేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. నియోజక వర్గాల వారీగా ఫెసిలిటేషను సెంటర్లు

రాజాం : ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాజాం

బొబ్బిలి : శ్రీ వేణుగోపాల మున్సిపల్‌ ఉన్నత పాఠశాల .. గొల్లపల్లి

చీపురుపల్లి : శ్రీరాం జూనియర్‌ కాలేజ్‌, యస్‌.డి.యస్‌. కాలేజి ప్రాంగణం గరివిడి

గజపతినగరం : ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల.. గజపతినగరం

నెల్లిమర్ల : సికెయం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మిమ్స్‌ ఆసుపత్రి పక్కన, నెల్లిమర్ల

విజయనగరం : జెయన్‌టియు. ఇంజినీరింగ్‌ కళాశాల

శృంగవరపుకోట : ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, శృంగవరపుకోట.

జిల్లాలో 18,631 పోస్టల్‌ బాలెట్లు

జిల్లాలో 18,631 మంది పోస్టల్‌ బాలెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. బొబ్బిలి నియోజక వర్గంలో 2105 మంది , చీపురుపల్లిలో 1405 మంది, గజపతినగరంలో 1665 మంది, నెల్లిమర్లలో 1525 మంది , విజయనగరంలో 3975 మంది , శృంగవరపుకోట (అసెంబ్లీ)లో 1776, రాజాంలో 1741 మంది పోస్టల్‌ బాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వీరిలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పిఒలు, ఎపిఒలు, మైక్రో అబ్జర్వర్లు , పోలీసు, ఆర్‌టిసి ఉద్యోగులు, ఇతర జిల్లాల్లో ఓట్లు ఉన్న వారు , ఎసెన్షియల్‌ సర్వీసు లో ఉన్నవారు, కూడా ఉన్నారు. ఇందులో హోం ఓటింగ్‌ కోసం ఆప్ట్‌ చేసుకున్న వారు 242 మంది ఉన్నారు. పోస్టల్‌ ఓటు విషయంలో ఏమైనా సందేహాలు ఉన్నవారు, కలెక్టరెట్లోని హెల్ప్‌ డెస్క్‌ 1950 ను సంప్రదించాలని సూచించారు.

➡️