చల్లారుతున్న అసంతృప్తులు

Apr 11,2024 21:18

 ఎస్‌.కోట, నెల్లిమర్లలో వెనక్కి తగ్గిన ఆశావహులు

విజయనగరం, గజపతినగరంలో సైలెంట్‌

చీపురుపల్లిలో సర్దుబాట్లు

సాలూరులోనూ ఇంకా కుదరని సయోధ్య

కురుపాంలో వెనక్కి తగ్గని వేరుకుంపటి

పాలకొండలో భూదేవి అసమ్మతిరాగం

టిడిపిలో మారుతున్న పరిణామాలు

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  టిడిపిలో నెలకొన్న అసమ్మతిరాగాలు, అసంతృప్తులు మెల్లగా చల్లారుతున్నాయి. కొన్నిచోట్ల ఆశావహులు, అసంతృప్తివాదులు వెనక్కి తగ్గుతుండగా, మరికొన్ని చోట్ల మౌనం వహిస్తున్నారు. ఇంకొన్నిచోట్ల నాయకుల మధ్య సయోధ్య, సర్ధుబాటులు జరుగుతున్నాయి. కురుపాంలో మాత్రం గ్రూపుల కుంపట యథాతధంగా కొనసాగుతోంది. పాలకొండ టిడిపి, జనసేన అభ్యర్థిని తాజాగా ప్రకటించడంతో అదే నియోజకవర్గానికి చెందిన భూదేవి అసమ్మతిరాగం తీస్తున్నారు. మొత్తానికి గతంతో పోలిస్తే టిడిపిలోవున్న అసమ్మతి సెగ నెమ్మదిగా తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. కానీ, ఆచరణలో అభ్యర్థుల విజయానికి సహకారం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. టిడిపిలో అసెంబ్లీ టిక్కెట్ల వ్యవహారంతో విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో దాదాపు అన్నిచోట్ల అసమ్మతి సెగలు కమ్ముకోవడం, కొన్ని నియోకవర్గాల్లో పదవులకు రాజీనామాలు చేయడం, స్వతంత్రంగా పోటీచేస్తామని హెచ్చరించడం తెలిసిందే. దీంతో, టిడిపి బాగా బలహీనపడినట్టుగా విశ్లేషణలు వెలువడ్డాయి. జనం నోట కూడా ఇదే వినిపించింది. పార్టీ అధినేత జోక్యంతో ఇప్పుడిప్పుడే ఒక్కతాటిపైకి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. ఎస్‌.కోట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించి భంగపడిన గొంప క్రిష్ణ (ఎన్‌ఆర్‌ఐ) స్వతంత్రంగా పోటీచేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. వేలాది మందితో భారీ ర్యాలీలు, సభలు కూడా నిర్వహించారు. చివరకు నాలుగు రోజుల క్రితం తానా ప్రతినిధి జోక్యంతో రాజీపడ్డారు. కొన్ని షరతులతో ఎమ్మెల్యే గెలుపునకు కృషిచేస్తానని ప్రకటించారు. విశాఖ ఎంపీ, ఎస్‌.కోట ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారితో కలిసి రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనడంతో గ్రూపు విభేదాలు దాదాపు తొలగినట్టేనని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. నెల్లిమర్ల అసెంబ్లీ టిక్కెట్‌ను జనసేనకు చెందిన లోకం మాధవికి కేటాయించిన సంగతి తెలిసిందే. టిడిపి నుంచి ఆశపడ్డ కర్రోతు బంగార్రాజు కూడా ఆమెతో కలిసి పనిచేసేందుకు నెల రోజులు పట్టింది. వారం క్రితం బంగార్రాజుతోపాటు ఇదే నియోజకవర్గంలోని మరో నాయకుడు కంది చంద్రశేఖర్‌ను కూడా చంద్రబాబు పిలిచి బుజ్జగించడంతో వీరంతా కలిసి పనిచేస్తున్నారు. గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడు కోటరీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌కు సహాయ నిరాకరణ ఉండేది. నాయుడు కోరిన వాయిదాలన్నీ గడిచిపోయినప్పటికీ టిక్కెట్‌ కేటాయింపులో మార్పు లేకపోవడంతో క్రమంగా ఆయన అనుయాయులు శ్రీనివాస్‌కు మద్ధతుదారులుగా మారుతున్నారు. శ్రీనివాస్‌ను కెఎ నాయుడు వ్యతిరేకిస్తున్నప్పటికీ తన కార్యాచరణ ప్రకటించి ముందుకు సాగకపోవడమే ఇందుకు కారణం. విజయనగరంలో (మిగతా..3లో) స్వతంత్రంగా రంగంలోకి దిగుతానని ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా ప్రస్తుతం స్తబ్ధతగా ఉన్నారు. దీంతో, ఈ రెండు నియోజకవర్గాల్లోనూ గ్రూపుల ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. చీపురుపల్లి సీటు ఆశపడి భంగపడ్డ కిమిడి నాగార్జున కినుక వహించినప్పటికీ అభ్యర్థి కళావెంకటరావు నెమ్మదిగా పార్టీలో పట్టుబిగిస్తున్నారు. నాగార్జున అనుయాయులతోపాటు వైసిపిలోని అసంతృప్తి నాయకులను కూడా తనవైపు తిప్పుకుంటున్నారు. ముఖ్యంగా మెరకముడిదాం మడలంలో కీలకనేతలుగా ఉన్న కోట్ల మోతీలాల్‌నాయుడు రెండు రోజుల క్రితం టిడిపిలో చేరారు. అంతకు ముందు, ఆ తరువాత కూడా చేరికలు కనిపించాయి. మన్యం జిల్లా సాలూరు నియోకవర్గం అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి, మక్కువ మండలంలోని కీలకనేతగా ఉన్న పెంట తిరుపతిరావు మధ్య నాయకులు సయోధ్య కుదిర్చారు. అయితే తిరుపతిరావు ఇంటి వద్ద సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి వెళ్లాలన్న నాయకుల సూచనను సంధ్యారాణి పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. కురుపాం అభ్యర్థి తోయక జగదీశ్వరికి మాత్రం అసమ్మతి సెగ తగ్గడం లేదు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ దత్తిలక్ష్మణరావు ఆధ్వర్యాన గిరిజనేతర నాయకులంతా వేరుకుంపటి పెట్టారు. పాలకొండ అభ్యర్థిగా జనసేన తరపున నిమ్మక జయకృష్ణకు టిక్కెట్‌ కేటాయించడంతో భంగపడ్డ పడాల భూదేవి అసమ్మతిరాగం తీస్తున్నారు. అధిష్టానం పునరాలోచించాలని, లేదంటే నాలుగు రోజుల్లో తన కార్యాచరణ జారీచేస్తానని అధిష్టానాన్ని హెచ్చరించారు. ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే.

➡️