మానవ అక్రమ రవాణా కేసులో పురోగతి

Jun 7,2024 00:50 #combodia, #police
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న సిపి రవిశంకర్‌

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ :

ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన మానవ అక్రమ రవాణా కేసులో పురోగతి సాధించామని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌ తెలిపారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఇటీవల కంబోడియా నుంచి నగరానికి చేరుకున్న నలుగురు బాధితులతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు భారతదేశం నుంచి వెళ్లి కంబోడియాలో చిక్కుకుపోయిన 158 మంది భారతీయులను గుర్తించామని తెలిపారు. వారిలో ఇప్పటి వరకూ 68 మందిని భారతదేశానికి తిరిగి తీసుకొచ్చామన్నారు. ఇంకా 90 మంది అక్కడే ఉన్నారని తెలిపారు. వారిలో 25 మంది భారతదేశానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన వారిలో 28 మంది విశాఖ వాసులని వెల్లడించారు. ఈ కేసు విచారణ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 21 మంది ఏజెంట్లను గుర్తించామని, వారిలో 11 మంది విశాఖ వారు ఉన్నారని తెలిపారు. మానవ అక్రమ రవాణా మాత్రమే కాకుండా సిమ్‌ కార్డ్‌ సప్లైకి సంబంధించి కూడా పెద్ద స్కాం నడుస్తోందని తెలిపారు. ఇండియా నుండి సిమ్‌ కార్డులు కొనుగోలు చేసి వాటిని కంబోడియాలో 10 వేల నుండి 15 వేలకు అమ్ముతున్నారని తెలిపారు. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను గుర్తించామని, వారిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌ వారు కాగా.. ఒకరు ఒడిశాకు చెందినవారని అన్నారు. ఆరుగురు ఏజెంట్లపై ఇప్పటికే లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ విడుదల చేశామన్నారు. భారతదేశం నుంచి వివిధ స్కాముల ద్వారా సేకరించిన సొమ్మును బిట్‌ కాయిన్‌లుగా మార్చి చైనాకు చేరవేస్తున్నారని తెలిపారు. కంబోడియాలో చిక్కుకున్న వారు ఎవరైనా భారతదేశానికి రావాలనుకుంటే తమను సంప్రదించాలని, పాస్‌పోర్ట్‌ లేని వారు కంబోడియాలోని భారత దేశ దౌత్య కార్యాలయాన్ని సంప్రదిస్తే వారు తాత్కాలిక పాస్‌ పోర్ట్‌ను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. బాధితులు మాట్లాడుతూ తమను ఆంధ్రప్రదేశ్‌ నుండి తెలిసినవారు కంబోడియాలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని అక్కడికి తీసుకెళ్లారన్నారు. అనంతరం కంబోడియాకి చెందిన కంపెనీలకు 4 వేల నుండి 6 వేల డాలర్లకు విక్రయించారన్నారు. వారు ఒక వారం పాటు ట్రైనింగ్‌ ఇచ్చి అనంతరం భారతదేశానికి చెందిన వ్యక్తులను పలు రకాల స్కామ్‌ల ద్వారా మోసం చేసేందుకు ఉసిగొల్పారన్నారు. వివిధ మార్గాల ద్వారా భారతీయులను ఆర్థికంగానూ, మానసికంగానూ బలహీనపరిచి భారత అర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయటమే ప్రధాన లక్ష్యంగా పలు సంస్థలు కంబోడియాలో పని చేస్తున్నాయని వారు వివరించారు. అక్కడ వారు చెప్పినట్టు పనిచేసి భారతీయులను మోసం చేస్తే లక్షల్లో ఇన్సెంటివ్‌ ఇస్తారని, పనిచేయని వారిని డార్క్‌ రూముల్లో పడేసి 2-3 రోజులు ఆహారం అందించకుండా చిత్రహింసలకు గురిచేస్తుంటారని తెలిపారు. ఇటీవల ఛేదించిన కేసులుగడిచిన నెలరోజుల్లో రెండు హనీ ట్రాప్‌ కేసులను నగర పోలీసులు ఛేదించారని క్రైమ్‌ బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ కె.భవానీ ప్రసాద్‌రావు తెలిపారు. వారిలో ఒక వ్యక్తి దగ్గర నుంచి రూ.46.6 లక్షలు, మరొక వ్యక్తి దగ్గర నుంచి కోటీ 12 లక్షలు సొమ్మును హనీ ట్రాప్‌ ద్వారా కంబోడియాకి చెందిన వ్యక్తులు కాజేసారని తెలిపారు. ఎవరైనా తెలియని వ్యక్తులు అమ్మాయిల ప్రొఫైల్‌ పిక్‌తో మెసేజ్‌ పంపిస్తే వాటికి స్పందించవద్దని ఆయన ప్రజలను కోరారు.

 

➡️