అసెంబ్లీలో జగన్‌ ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమే

Jun 27,2024 00:42 #Gajuwaka MLA palla
Gajuwaka MLA palla

 ప్రజాశక్తి -గాజువాక : అసెంబ్లీలో జగన్మోహన్‌రెడ్డి ఫ్లోర్‌లీడర్‌ మాత్రమేనని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థాయిని కోరడం ప్రజా తీర్పును అవహేళన చేయడమేనన్నారు. రాష్ట్ర శాసనసభలో పదో వంతు శాసనసభ్యులను గెలుచుకునే పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదా కలుగుతుందని తెలిపారు. కేవలం 11 స్థానాలు గెలుచుకున్న జగన్మోహన్‌రెడ్డి శాసనసభలో ఫ్లోర్‌ లీడర్‌గా మాత్రమే అవుతారన్నారు. అసెంబ్లీ నిబంధనలు తెలియ జేస్తున్నప్పటికీ లేనిపోని రాద్ధాంతాలు చేయాలని ప్రయత్నించడం ఆక్షేపనీయమన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి నిర్మాణాత్మకమైన ఫ్లోర్‌లీడర్‌గా కొనసాగాలని హితవుపలికారు. ఈ నెల 28వ తేదీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టిడిపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపడతానని తెలిపారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులు ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సూపర్‌ సిక్స్‌ పథకాలను అమల్లోకి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయకుమార్‌, జివిఎంసి డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గంధం శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పులి వెంకటరమణారెడ్డి, చెరుకూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️