ఉక్కు పరిరక్షణ కోసం.. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి

Jun 21,2024 00:12 #cituvizag, #steelplant
మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్‌

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ :

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, పబ్లిక్‌ సెక్టార్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ ఎస్‌.జ్యోతీశ్వరరావు, కో-కన్వీనర్‌ కె.కుమార్‌ మంగళం డిమాండ్‌ చేశారు. గురువారం జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోనూ, విశాఖలోనూ 1225 రోజులుగా కార్మికులు, ప్రజలు పెద్దఎత్తున పోరాడుతున్నారన్నారు. ప్లాంట్‌ను పరిరక్షిస్తామని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, విశాఖ ఎంపీ శ్రీభరత్‌, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు పలు సభల్లో తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఆ సర్కారు మద్దతుతో కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను చేయబోమని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే బిపిసిఎల్‌ను ప్రైవేటీకరణ చేయబోమని పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్‌పురి ప్రకటన చేశారన్నారు. కేంద్ర గనులు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి క్యాపిట్‌మైన్స్‌ స్టీల్‌ప్లాంట్‌కి కేటాయించకుండా, స్టీల్‌ప్లాంట్‌ కూడా గనులు కోసం జరుగుతున్న వేలం పాటలో పాల్గొనవచ్చునని చేసిన ప్రకటన నీతి బాహ్యమైనదని అభివర్ణించారు. గాలి జనార్ధనరెడ్డి లాంటి వారికి మైన్స్‌ కేటాయించడం దుర్మార్గమన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వ సంస్థ అని, దేశంలో ఉన్న అన్ని స్టీల్‌ప్లాంట్స్‌కు సొంత గనులు ఉండగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మాత్రమే లేవని తెలిపారు. తక్షణమే సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌కు చీపురుపల్లి, కింతాడ, గర్భాంల్లో ఉన్న గనుల లీజ్‌ను తక్షణం పునరుద్ధరించాలన్నారు. ప్లాంట్‌ ఉత్పత్తికి అవసరమైన అన్ని ముడిసరుకులను సరఫరా చేయాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంలో భూములు కొల్పోయిన నిర్వాసితులకు ఇప్పటికీ 8,500 మందికి ఉపాధి కల్పించలేదన్నారు. తక్షణం వారందరికీ ఉపాధి కల్పించాలన్నారు. 2017లో జరిగిన నూతన వేతన ఒప్పందాన్ని స్టీల్‌ప్లాంట్‌ కార్మికులందరికీ వెంటనే వర్తింపచేయాలని కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)లో విలీనం చేయాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను యధాస్థితికి తీసుకువచ్చేందుకు రూ.5 వేల కోట్లును కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌గా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ సిఎమ్‌డి అతుల్‌భట్‌ కార్మికులకు, ప్లాంట్‌కు నష్టం చేకూర్చే విధానాలను అవలంబిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆయన్ని కేంద్ర ప్రభుత్వం రీ కాల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

 

➡️