నిర్భయంగా ఓటు వేయండి

May 6,2024 21:28

ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రజలంతా నిర్భయంగా ఓటు వేయాలని అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌ అన్నారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం చేపట్టిన మహిళల ర్యాలీని కోట జంక్షన్‌ వద్ద జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు తలాత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా ప్రారంభించారు. సోమవారం సాయంత్రం కోట జంక్షన్‌ నుంచి సింగపూర్‌ సిటీ వరకు ఈ 2 కిలోమీటర్ల ర్యాలీ జరిగింది. దాసన్నపేట జంక్షన్‌లో మానవ హారాన్ని నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగ లాంటివని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికలే మూలాధారమని అన్నారు. గత ఎన్నికల్లో పురుషుల కంటే మహిళల ఓటింగే ఒక్క శాతం అధికంగా నమోదయ్యిందని చెప్పారు. శతశాతం ఓటింగ్‌ నమోదు చేసే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. దీనిలో భాగంగా స్వీప్‌ కార్యక్రమాన్ని నిర్వహించి, పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువ ఓటర్లంతా ముందుకు వచ్చి ఓటు వేయాలని కోరారు. ఎన్నికల్లో అక్రమాలను గుర్తిస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్వీప్‌ నోడల్‌ అధికారి, హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు, జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వర్రావు, స్వీప్‌ రీసోర్స్‌ పర్సన్‌ పద్మనాభం, మున్సిపల్‌ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

➡️