ఉదయం నుంచే ఓటర్ల బారులు

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: ప్రజా చైతన్యం వెల్లివిరిసింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 75 శాతం పోలింగ్‌ నమోదైంది. గడువు ముగిసే సమయానికి ఇంకా లైన్లలో ఉండడంతో కొన్నిచోట్ల ఓటింగ్‌ రాత్రి 11 గంటల దాకా పోలింగ్‌ సాగింది. మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని మార్కాపురం పట్టణం, మండలం, తర్లుపాడు, పొదిలి, కొనకనమిట్ల మండలాల్లో పోలింగ్‌ బాగానే నమోదయింది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులతో పాటు యువ ఓటర్లు ఉత్సాహంగా కదిలొచ్చారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు. గెలుపు తమదేనని ఓటేసిన అనంతరం ధీమా వ్యక్తం చేశారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోగా పోలీసులు రంగంలోకి దిగి అల్లరి మూకలను చెదరగొట్టారు. ఈవీఎంలలో ప్రజా తీర్పు నిక్షిప్తంప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వచ్చే నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆరోజు అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. యువత, వృద్ధులు, దివ్యాంగులతోపాటు కొత్తగా ఓటుహక్కును నమోదు చేసుకున్న వారు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాలవారు ఓటేసేందుకు ముందుండడం విశేషం. ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండే వారు సైతం స్వగ్రామానికి చేరుకుని వారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా, ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం అధికారులు వీల్‌చైర్లు, వాహనాలు తదితర సదుపాయాలు కల్పించారు. మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా బూత్‌లను ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ ఓటుహక్కును వినియోగించుకుకొని స్ఫూర్తి చాటారు. కొన్ని కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరగా.. ఓటు వేసేందుకు గంటల కొద్దీ సమయం పట్టింది. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో ఉన్న ప్రతిఒక్కరికీ అధికారులు ఓటు వేసేందుకు అనుమతిచ్చారు. మార్కాపురం ఉప కలెక్టర్‌, నియోజకవర్గ ఎన్నికల అధికారి రాహుల్‌ మీనా పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మార్కాపురం డిఎస్పి పి బాలసుందర్రావు నేతృత్వంలో మార్కాపురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆవుల వెంకటేశ్వర్లు, పట్టణ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐలు షేక్‌ అబ్దుల్‌ రెహమాన్‌, ఎం. వెంకటేశ్వర్‌ నాయక్‌ కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, పోలీసులు ప్రజలు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.

➡️