ఆర్థిక భారాలు మోపుతూ.. విధ్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపిని ఓడించాలి

Apr 15,2024 23:31

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని, పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటివి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ద్వారానే సాధ్యమవుతాయని ఇండియా బ్లాక్‌ తరుపున నరసరావుపేట పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గర్నెపూడి అలెగ్జాండర్‌ సుధాకర్‌, ఎమ్మెల్యే అభ్యర్థి మహబూబ్‌ బాషా అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్‌లో గల జిల్లా క్రీడా ప్రాంగణంలో సోమవారం మార్నింగ్‌ వాక్‌ విత్‌ ఓటర్స్‌ కార్యక్రమంలో వారు పాల్గొని వాకర్లతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్న బిజెపి ప్రభుత్వానికి, బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన, అదే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వైసిపికి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, ఇసుక ధరలు, ఆస్తి పన్నులు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ, కులాల మధ్య చిచ్చు పెడుతూ ప్రాంతాల మధ్య విద్వేషాలతో రాజకీయాలు చేస్తున్న బిజెపిని ఓడించాలని, ఇండియా బ్లాక్‌ తరుపున పోటీ చేస్తున్న కాంగ్రెస్‌, వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

➡️