సమగ్రశిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసేంతవరకు పోరాడుతాం

Dec 23,2023 16:45 #Kakinada
  • నాలుగో రోజుకు నిరవధిక సమ్మె
  • సిఎం జగన్‌ ఇచ్చిన హామీ అమలు చేయాలి, సిఐటియు డిమాండ్‌

ప్రజాశక్తి-కాకినాడ : విద్యాశాఖలో పనిచేసే సమగ్రశిక్ష ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేసి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిని ఇవ్వాలని, పది లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ పిఎఫ్‌, ఈఎస్‌ఐ తక్షణం వర్తింపజేయాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలలో కారుణ్య నియామకాలు చేపట్టాలని, రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచి పార్ట్‌ టైం విధానాన్ని రద్దుచేసి, మినిమం టైమ్‌ స్కెల్‌ అమలు చేసి వేతనాలు పెంచాలని, ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలనే తదితర డిమాండ్లతో సమగ్రశిక్షా ఉద్యోగులు చేపట్టిన సమ్మె 4వరోజుకు చేరుకుంది. శనివారం సమ్మె శిబిరానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సత్తిరాజు, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.పుల్లయ్య మాట్లాడుతూ.. జగన్‌ ప్రభుత్వం రెగ్యులర్‌ ఉద్యోగులను, కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను, గౌరవ వేతనంపై, ప్రభుత్వ పథకాలలో పనిచేసేవారందరినీ మోసం చేస్తూనే ఉన్నాడని, ఎవరికీ ఇచ్చిన హామీ మేరకు పిఆర్సిగాని, రెగ్యులరైజేషన్‌ గాని, వేతనాల పెంపుగాని చేయకుండా ఉద్యోగ, కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులమనే కారణంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటికీ సమగ్రశిక్ష ఉద్యోగులను దూరం పెట్టాడని, ఎనిమిది వేల నుండి 18 వేల లోపు జీతాలు తీసుకునే చిరుద్యోగులను ప్రభుత్వ పథకాలు అమలు చేయక, పిఆర్సి ప్రకారం వేతనాలు చెల్లించకపోవడం న్యాయంకాదన్నారు. ఆనాడు అధికారంలోకి రావడానికి ఉద్యోగులందరికీ ఆశపెట్టి, నేడు అధికారంలోకి వచ్చాక నిరాశను మిగిల్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నర ఏళ్లపాటు ఎదురుచూపులు చూస్తూనే ఉన్నామని, ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా ఒంటెద్దు పోకడలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లడంతో సమ్మె చేయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలియజేశారు. నిత్యావసరాల ధరలు 200 నుండి 600 శాతం పెరుగుతూ పోతుంటే 2019 నాటి వేతనాలతో ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. విద్య, వైద్యం ఖరీదుగా మారుతున్న సమయంలో ఉన్న ఆస్తుల్ని అమ్ముకుని అప్పుల పాలవుతూ, కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. ఈ పరిస్థితుల్ని తట్టుకోలేక కొంతమంది ఉద్యోగులు ఆత్మహత్యలకు సైతం పాల్పడి, కుటుంబాలు రోడ్డునపడితే జగన్‌ ప్రభుత్వం వారిని కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. తక్షణం సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ శిబిరానికి ఐద్వా నగర కార్యదర్శి జ్యోతి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, ప్రధానోపాధ్యాయులు సంఘం రాష్ట్ర కోశాధికారి సిహెచ్‌.రవి, డీఈవో ఐటి సెల్‌ విభాగం నుండి ఏపీవో వేకటేశ్వరరావు, కాకినాడ అర్బన్‌ డిప్యూటీ ఇంస్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ వాణికుమారి, కరప ఎస్టీయూ నాయకులు జిబి. భాస్కర్‌, రిటైర్‌ టీచర్‌ రాజశేఖర్‌ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ శిబిరానికి జేఏసీ అధ్యక్షులు ఎం.చంటిబాబు, పివివి.మహాలక్ష్మి, ఎ.సత్యనాగమణి, పి.రాజు, డి.గంగాధర్‌, డి.దానియేలు తదితరులు నాయకత్వం వహించారు.

➡️