యువతకు భరోసా ఇస్తాం

May 7,2024 21:47

యువగళం సభలో నారా లోకేష్‌

ప్రజాశక్తి-విజయనగరం కోట  : టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత యువతకు ఉపాధి, ఉద్యోగాలకు భరోసానిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. విశాఖను ఐటి రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. నగరంలోని అయోధ్య మైదానంలో మంగళవారం నిర్వహించిన యువగళం ఎన్నికల ప్రచార సభలో లోకేష్‌ పలువురు విద్యార్థులు, యువత అడిగిన ప్రశ్నలకు సమాధానిలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్టణాన్ని ఐటి రాజధానిగా తీర్చి దిద్దుతామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక మూడునెలలకే జగన్‌ మూడు ముక్కలాట మొదలెట్టారని అన్నారు. రుషికొండకు గుండుకొట్టి ఒక్క వ్యక్తి బతకడానికి రూ.500 కోట్లతో ప్యాలెస్‌ కట్టుకున్నారని, ఆ డబ్బుతో విజయనగరం జిల్లాలో పేదలందరికీ ఇళ్లు నిర్మించే అవకాశం ఉండేదని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి రుషికొండలో కట్టిన ప్యాలెస్‌ కు కేంద్రం రూ.200 కోట్ల పెనాల్టీ కూడా విధించిందన్నారు. మొత్తం 700 కోట్లు దుర్వినియోగం చేశారు. భవనాలను కూల్చడం టిడిపి బ్లడ్‌లో లేదని, చంద్రబాబుకు కట్టడమే తెలుసు, కూల్చడం తెలియదని తెలిపారు.రుషికొండ ప్యాలెస్‌ను కూడా ప్రజల అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ గానీ, ఒక్కరికి ఉద్యోగం గానీ వచ్చిందా? అని ప్రశ్నించారు. ఎక్కడ చూసినా భూకబ్జాలు, దోపిడీలు, ఇసుక, గంజాయి, డ్రగ్స్‌ మాఫియాలు, హత్యలు పెరిగిపోయాయని అన్నారు. కుటుంబసభ్యులే వైసిపి నేతలను నమ్మడంలేదుజగన్‌ ఒక బిల్డప్‌ బాబాయి అని, వెయ్యికోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి నువ్వే మా నమ్మకం అని బోర్డులు పెట్టారని విమర్శించారు.

కుటుంబసభ్యులే ఆయనను నమ్మడం లేదని, వైసిపి నాయకులకు వారి కుటుంబసభ్యులు నమ్మడం లేదని అన్నారు. హత్యారాజకీయాలు చేసిన అన్నను నమ్మవద్దని చెల్లి సునీత చెప్పిందని, జగన్‌ కు ఓటువేస్తే మా కుటుంబానికి పట్టిన గతే రాష్ట్రానికి అని చిన్నమ్మ సౌభాగ్యమ్మ చెప్పిందని అన్నారు. జగనన్న ఊసరవెల్లి అని చెల్లెమ్మ షర్మిల చెప్పిందన్నారు. కుటుంబసభ్యులే నమ్మని జగన్‌ ను ప్రజలు ఎలా నమ్మాలి? అంబటి రాంబాబు నీచుడు, దుర్మార్గుడు అని ఆయన అల్లుడు చెప్పారని, సొంత కొడుకుకే న్యాయం చేయలేదని ముత్యాలనాయుడు కుమారుడు చెప్పాడని వివరించారు. ముద్రగడ కూతురు మీడియా ముందు వైఎస్‌ జగన్‌ మా తండ్రిని ట్రాప్‌లో పడేశారని, వాడుకుని వదిలేస్తాడని చెప్పిందని, దువ్వాడ శ్రీను భార్య తన భర్తకు ఓటువేయద్దని చెప్పిందని అన్నారు.ఇలా జగన్‌, వైసిపి నాయకులను వారి కుటుంబసభ్యులు నమ్మడం లేదని, . 5కోట్ల మంది ప్రజలు ఎలానమ్మాలి? అని ప్రశ్నించారు. 2019లో ఒక్క అవకాశం మాయమాటలో పడి ప్రజలు మోసపోయారని లోకేష్‌ అన్నారు. అధికారంలోకి వచ్చాక 2.3లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్నాడని, ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? అనిఫ్రశ్నించారు. ఫీజు రియంబర్స్‌ మెంట్‌ లేదు, నిరుపేద విద్యార్థులకు విదేశీవిద్య కూడా లేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్‌సి పైనే అని తెలిపారు. సింగిల్‌ జాబ్‌ క్యాంలెండర్‌ ప్రతిఏటా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తామని, అయిదేళ్లలో పెండింగ్‌ పోస్టులన్నీ భర్తీ చేస్తామని, ప్రైవేటురంగంలో పెట్టుబడులు, పరిశ్రమలు రప్పించి 20లక్షల ఉద్యోగాలు తెస్తామని యువతకు భరోసా ఇచ్చారు. ఆ సొమ్మంతా ఏ పంది కొక్కులు తింటున్నాయో చెప్పండి బొత్స కుటుంబం జిల్లాను కేకు ముక్కలా కోసుకుని తింటున్నారని లోకేష్‌ విమర్శించారు. బొత్స సత్యనారాయణ, అప్పలనర్సయ్య, చిన్నశ్రీను, బడ్డుకొండ అప్పలనాయుడు ఇలా ఏరియాలవారీగా పంచుకున్నారని అన్నారు. ఇసుక, మద్యం, మైన్స్‌ డబ్బులు ఏ పందికొక్కులు తింటున్నాయో చెప్పాలని అన్నారు. ప్రజల భూములకు కొట్టేయడానికి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తెచ్చారన్నారు. మళ్లీ రాష్ట్రాన్ని జాబ్‌ క్యాపిటల్‌ గా మార్చాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అధికారంలోకి వస్తే విజయనగరం జిల్లాకు పరిశ్రమలు తెస్తామని, యువతకు ఉపాధి కల్పించి వలసలను నివారిస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ టైమ్‌ అయిపోయిందని, ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌ గజపతిరాజు, విజయనగరం పార్లమెంట్‌ అధ్యక్షులు కిమిడి నాగార్జున, ఎంపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, అసెంబ్లీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు.

➡️