ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

May 2,2024 21:07

ప్రజాశక్తి – భోగాపురం : కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తే నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి అన్నారు. మండలంలోని తూడెం, సవరవల్లి, మరడపాలెం, కొత్త చెరుకుపల్లి, పాత చెరుకుపల్లి, గుడివాడ పంచాయతీలలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యలున్నా ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. మహిళా అభ్యర్థిగా తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. విమానాశ్రయ నిర్మాణంలో పరిహారం ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేసారన్నారు. టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు, మండల అధ్యక్షులు కర్రోతు సత్యన్నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో మరోసారి జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనమవుతుందన్నారు. గత ఐదేళ్లలో ప్రజలను నిలువునా దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలకు మేలు జరగాలంటే కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. కూటమి నాయకులు మట్టా అయ్యప్ప రెడ్డి, చెల్లుబోయిన నర్సింగరావు, దాసరి అప్పలస్వామి, కర్రోతు శ్రీనివారావు, కోరాడ తాతారావు, కర్రోతు రాజు, బైరెడ్డి తోగులురెడ్డి, రీసు రమణ తదితరులు పాల్గొన్నారు.జనసేనలో పలువురు చేరిక మండలంలోని ముంజేరు, రాజాపులోవ, పతివాడ గ్రామాల నుంచి పలువురు వైసిపిని వీడి జనసేనలో చేరారు. పార్టీ నాయకులు లోకం ప్రసాద్‌, మట్టా అయ్యప్ప రెడ్డి, సి హెచ్‌ నర్సింగరావు, జలపారి అప్పడుదొర, బాలి అప్పలరాజు ఆధ్వర్యంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

➡️