అంపశయ్యపై అన్నదాత..!

పాలకులు రైతుల గురించి చెబుతున్న మాటలకు.. కార్యాచరణకు ఏమాత్రం సంబంధం లేకుండాపోయింది. ఈ సంవత్సరం రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలు రైతును నిలువునా ముంచాయి. ఈ ఏడాది భారీ వర్షాలకు, కరువుకు లక్షకుపైగా ఎకరాల్లో పంట దెబ్బతింది. సాగు చేసిన రైతుకు ప్రభుత్వం ఏమాత్రం అండగా నిలబడలేకపోయింది. నష్టపరిహారం, బీమా, పంట రుణాలు ఏఒక్కటీ సాగుదారుడైన కౌలురైతులకు అందలేదు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ తీరు ఏమాత్రం మారలేదు. రబీ, ఖరీఫ్‌ల్లో సైతం మిల్లర్లకు ఎదురు సొమ్ము చెల్లించాల్సిన దుస్థితి కొనసాగింది. ధరలేక, మేత ధర పెరిగి ఆక్వారైతుల పరిస్థితి దారుణంగా మారింది. పెరిగిన ఖర్చులకు, పంటలకిచ్చే మద్దతు ధరకు మధ్య పొంతన లేకపోవడంతో వ్యవసాయం చేస్తున్న అన్నదాత అంపశయ్యపై కొట్టుమిట్టాడుతున్నాడు.

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 80 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారే. ఈ సంవత్సరం జిల్లాలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలతోపాటు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. రెండు జిల్లాల్లోనూ రబీలో 3.50 లక్షల ఎకరాల్లో, ఖరీఫ్‌లో 4.30 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టారు. జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో మొక్కజొన్న, లక్షా 20 వేల ఎకరాల్లో పామాయిల్‌, 40 వేల ఎకరాల్లో పొగాకు, 50 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో మామిడి, ఇక పత్తి, కొబ్బరి, మిరప వంటి పంటలతోపాటు రెండు జిల్లాల్లోనూ దాదాపు రెండు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు రైతులు చేస్తున్నారు. ఒకపక్క తుపాన్లు, వరదలు, మరోపక్క కరువు విలయతాండవంతో రైతులు కోలుకోలేని స్థితికి చేరుకున్నారు.వరి రైతు విలవిల వరిసాగులో ఉమ్మడి పశ్చిమగోదావరికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది రబీలో ఏలూరు జిల్లాలో 2.40 లక్షల ఎకరాల్లో, ఏలూరు జిల్లాలో 57 వేల ఎకరాల్లో వరిసాగు చేపట్టారు. నీటిఎద్దడి సమస్యను ఎదుర్కొని, వంతులవారీ విధానంలో రాత్రీ పగలు చెమటోడ్చి పంట పండించారు. తీరా మాసూళ్లు చేసే చివరి దశలో వర్షాలు ముంచెత్తాయి. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ధాన్యం కొనుగోలు సరిగా జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తేమశాతం, తూకం పేరుతో మిల్లర్లకు ఎదురు సొమ్ము చెల్లించాల్సి వచ్చింది. గోనె సంచులు అందక, రవాణాకు లారీలు దొరక్క రైతులు సతమతమయ్యారు. సకాలంలో సొమ్ము చెల్లించకపోవడంతో నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఖర్చులు పెరగడంతో పెట్టుబడి తడిసి మోపెడైంది. దీంతో మిగులు అనేది లేకపోగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఖరీఫ్‌లో ఏలూరు జిల్లాలో రెండు లక్షల ఎకరాలు, పశ్చిమలో 2.25 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. వర్షాకాలం నాలుగు నెలల్లో ఒక్క జులైలో మినహా మిగిలిన మూడు నెలలు వర్షాలు కురవలేదు. దీంతో నీటిఎద్దడి సమస్యతో రైతులు విలవిల్లాడారు. ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతంలో కరువు విలయతాండవం చేసింది. చింతలపూడి, చాట్రాయి, ద్వారకాతిరుమల, కామవరపుకోట, బుట్టాయగూడెం ఇలా 11 మండలాల పరిధిలో 12 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పంట పశువులకు మేతగా మారింది. ఇది అధికారిక లెక్కల ప్రకారమే. సాగునీరు అందక 50 శాతంపైగా దెబ్బతిన్న పంటపొలాలు మరో ఎనిమిదివేల ఎకరాల వరకూ ఉన్నాయి. మోటారు బోర్ల నుంచి నీరురాని పరిస్థితి ఏర్పడింది. తమను ఆదుకోవాలంటూ రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పంట నష్టపరిహారం చిల్లిగవ్వ ఇవ్వలేదు. జిల్లాలో ఏ ఒక్క మండలాన్నీ కరువు మండలంగా గుర్తించని పరిస్థితి ఉంది. పంట చేతికొచ్చే సమయంలో డిసెంబర్‌ మొదటి వారంలో విరచుకుపడిన మిచౌంగ్‌ తుపాను దెబ్బకు రెండుజిల్లాల్లోని వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం చెబుతున్న అధికారిక లెక్కల ప్రకారం 33 శాతానికిపైగా దెబ్బతిన్న పంట పశ్చిమలో 49,495 ఎకరాలు, ఏలూరు జిల్లాలో 37,936 ఎకరాలు. మొత్తం 80 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. తుపాన్‌, వరదలు, కరువుతో ఈ ఏడాది లక్షకుపైగా ఎకరాల్లో పంట దెబ్బతింది. ఖరీఫ్‌లోనూ ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తప్పలేదు. రంగుమారిన, తేమకు సంబంధించిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ రాలేదు. దీంతో తేమశాతం 17 దాటిన తర్వాత ఒక్కింటికి రూ.20 చొప్పున మిల్లర్లకు ఎదురుసొమ్ము చెల్లించి రైతులు ధాన్యం విక్రయించారు. ఆఫ్‌లైన్‌లో రైతులు అయినకాడికి ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చింది. తుపానుతో మరోపక్క రబీ నారుమడులు ఆలస్యం కావడంతో వచ్చే ఏడాది పంటపైనా తీవ్ర ప్రభావం పడనుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో వరిరైతుల పరిస్థితి దారుణంగా మారింది.దుర్భర స్థితిలో కౌలురైతులు రెండు జిల్లాల్లోనూ మూడు లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. ఈ ఏడాది ఏలూరు జిల్లాలో 57 వేల మందికి, పశ్చిమలో 89 వేల మంది మొత్తం లక్షా 46 వేల మంది కౌలురైతులకు మాత్రమే సిసిఆర్‌సి (సాగుదారుని హక్కు పత్రాలు) జారీ చేశారు. ఈ ఏడా ది ఇప్పటి వరకూ రెండు జిల్లాల్లో నూ 70 వేల మంది కౌలురైతులకు కేవలం రూ.424 కోట్లు మాత్రమే బ్యాంకులు పంటరుణాలు మంజూరు చేశాయి. రుణార్హత కార్డులు జారీ చేసిన సగం మందికి కూడా రుణాలు అందలేదు. దెబ్బతిన్న పంటలకు సం బంధించి ఇ-క్రాప్‌ ఆధారంగా పంటనష్టం నమోదు ప్రక్రియ జరగడంతో కౌలురైతులకు తీరని అన్యాయం జరిగింది. చివరకు పండించిన ధాన్యం కూడా భూయజమాని పేరునే అమ్మాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. కౌలుచట్టంలో మార్పు చేసి వైసిపి ప్రభుత్వం కౌలురైతులను నిలువునా దెబ్బతీసింది. రబీ, ఖరీఫ్‌లోనూ ధాన్యం తడిసి, సరైన ధర లేక నష్టపోయిన కౌలురైతులకు ప్రభుత్వం ఎటువంటి సాయమూ అందించలేదు. దీంతో సాగు చేయాలంటేనే కౌలురైతులు భయపడుతున్నారు.కష్టాల కడలిలో ఆక్వారైతు ఈ ఏడాది రొయ్య, చేప వంటి ఆక్వాసాగు చేస్తున్న రైతుల పరిస్థితి దుర్భంగా మారింది. సరైన ధర లేక, మేత ధరలు పెరిగి ఆక్వారైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. రెండు జిల్లాల్లోనూ దాదాపు రెండు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ఇందులో రొయ్యల సాగు విస్తీర్ణం దాదాపు లక్షా 20వేల ఎకరాల్లో ఉంది. మేత ధరలపై దిగుమతి సుంకం 15 నుంచి 30 శాతానికి పెరిగిపోయింది. దీంతో ఆక్వాసాగులో అత్యధిక ఖర్చు మేతకే అయిపోతుంది. సోయాబీన్‌ ధరలు పెరగడంతో 25 కిలోల మేత బస్తాపై రూ.125 పెరిగింది. గతేడాది కంటే ఈ ఏడాది ఎకరాకు రూ.75 వేలకుపైగా మేత ఖర్చు అదనంగా అయినట్లు రైతులు చెబుతున్నారు. ఒకపక్క మేత ధరలు విపరీతంగా పెరగ్గా, రొయ్య, చేప ధరలు మాత్రం భారీగా తగ్గడంతో రైతులు నష్టాలను చవిచూశారు. రొయ్య వందకౌంట్‌ ధర రూ.250 నుంచి రూ.180కు పడిపోయింది, వందకౌంట్‌ రొయ్య ఉత్పత్తి చేయాలంటే ఖర్చు రూ.240 అవుతోంది. ఈ విధంగా ఆక్వా ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా రైతులు భారీ నష్టాలను చవిచూశారు. మేత ధరలకు సబ్సిడీ వంటి ప్రోత్సాహాకాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోని పరిస్థితి. వర్షాలు కురవకుండా ఎండలు విపరీతంగా కాయడంతో రొయ్య సాగుపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో రొయ్యల చెరువులు దెబ్బతిని నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో రూప్‌చంద్‌ చేపల సాగు ఎక్కువగా జరుగుతోంది. కిలో రూ.80కి పైగా పలికే ధర రూ.60కు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. కాగితాల్లోనే ఆధునికీకరణ వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక డెల్టా ఆధునికీరణను పూర్తిగా గాలికొదిలేసింది. ఈ ఏడాది సైతం ఆధునికీకరణ పనులు ఏ ఒక్కటీ చేపట్టని పరిస్థితి నెలకొంది. తూడు, గుర్రపు డెక్క పనులు వంటివి తూతుమంత్రంగా చేయడం తప్ప దెబ్బతిన్న షట్టర్లు బాగు చేయించడం వంటివేమీ జరగలేదు. దీంతో చిన్నపాటి వర్షాలకు సైతం వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. ఈ నాలుగున్నరేళ్లలో ఆధునికీకరణ పనులు జరగకపోవడంతో కాలువలన్ని మెరకతేరిపోయాయి.పామాయిల్‌, , కొబ్బరి , మామిడి రైతు కుదేల్‌ జిల్లాలో అతిపెద్ద వ్యవసాయసాగులో ఆయిల్‌పామ్‌ ఒకటి. దాదాపు లక్షా పది వేల ఎకరాల్లో రైతులు పామాయిల్‌ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పామాయిల్‌ రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. గతేడాది టన్ను పామా యిల్‌ గెలల ధర రూ.23 వేలు పలికింది. ఈఏడాది ధర ఆమాంతంగా రూ.12,900కు పడిపోయింది. గతేడాది ధర ఎక్కువగా ఉండటంతో పామాయిల్‌ కౌలుధర ఎకరాకు రూ.లక్ష దాటేసింది. తెల్లదోమ సోకి దిగుబడి సైతం తగ్గిపో యింది. పది టన్నులు దిగుబడి రావాల్సిన తోట ఏడెనిమిది టన్నులు మించలేదు. ఎకరా పామాయిల్‌ సాగుకు రూ.లక్షా 50 వేల వరకూ ఖర్చవుతుండగా, ప్రభుత్వం ఇచ్చిన ధరతో రూ.90 వేలు ఆదాయం కూడా రాలేదు. రెండు జిల్లాల్లోనూ దాదాపు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. సాగు ఖర్చు లు పెరిగిపోయాయిగాని కొబ్బరి కాయ ధర మాత్రం రూ.ఆరు, ఏడు మాత్రమే పలుకుతోంది. ఏలూరు జిల్లాలో దాదాపు 50 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. సరైన ధరలేక ఈఏడాది మామిడి రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. జిల్లాలో 40వేల ఎకరాల్లో పొగాకు సాగు ఉండగా ధర హెచ్చుతగ్గులతో పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అగ్రిమెంట్లు లేకుండానే మొక్కజొన్న సాగు మొక్కజొన్న రైతుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. ఇందులో దాదాపు 50 వేల నుంచి 60 వేల ఎకరాల్లో కంపెనీలు ఇచ్చే సీడ్స్‌ పంట సాగవుతోంది. నిబంధనల ప్రకారం సీడ్స్‌ ఇచ్చే కంపెనీలు రైతులకు అగ్రిమెంట్లు రాయాలి. సీడ్‌ దెబ్బతింటే రైతులకు నష్టపరిహారం కంపెనీలే చెల్లించాలి. అయితే జిల్లాలో ఎక్కడా అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. నూజివీడు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో నాసిరకం సీడ్స్‌తో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. మొక్కజొన్న రైతులకూ ప్రభుత్వం ఏమాత్రం అండగా నిలవని పరిస్థితి ఉంది.

➡️