అడ్వాన్స్‌డ్‌ లెర్నింగ్‌ సిస్టంపై అవగాహన

ప్రజాశక్తి – పాలకొల్లు
2024-2025 విద్యా సంవత్సరం నుంచి పాలకొల్లు మాంటిస్సోరి స్కూల్‌లో లీడ్‌ ఎడ్యుకేషన్‌ సొల్యూషన్స్‌ వారి సహకారంతో ప్రారంభించనున్న అడ్వాన్స్‌డ్‌ లెర్నింగ్‌ సిస్టంకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదివారం స్కూల్‌ ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. దేశంలో సుమారు తొమ్మిది వేల స్కూల్స్‌కు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ అందిస్తూ, ఎల్‌సిడిలు, ట్యాబ్స్‌ సహకారంతో ఇ-లెర్నింగ్‌ తరగతులు లీడ్‌ ఎడ్యుకేషనల్‌ సొల్యూషన్స్‌ సంస్థ నిర్వహిస్తుంది. ఈ సంస్థ తరపున స్టేట్‌ హెడ్‌కుమారి స్వప్న, అసోసియేట్‌ హెడ్‌ రెహమాత్‌, రీజనల్‌ ఇన్‌ఛార్జి చరణ్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధునిక శిక్షణ విధానాల్లో వస్తున్న అనేక మార్పులను, అందివస్తున్న టెక్నాలజీ సహకారంతో, వీలైనంత సులభంగా అర్థం చేసుకోవడంలో గాని, లోతుగా విషయాన్ని అధ్యయనం చేయడానికి గాని, ప్రపంచవ్యాప్తంగా సమ కాలీనంలో జరుగుతున్న విషయాల పట్ల అవగాహన పెంచుకోవడంలో గాని, పరిపూర్ణమైన వ్యక్తులుగా ఎదగడానికి ఈ విద్యా విధానం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అకాడమిక్‌ డైరెక్టర్‌ కెవి.కృష్ణవర్మ మాట్లాడుతూ పాలకొల్లులో ఉన్న స్కూలులో మొదటిసారిగా పాలకొల్లు మాంటిస్సోరిలో ఈ ఆధునిక టెక్నాలజీని ప్రవేశ పెడుతున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఏ విధమైన అదనపు ఫీజులు వసూలు చేయకుండా విద్యార్థుల ఉన్నతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి కర్కులంలో భాగంగా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ ఎస్‌పిఎస్‌.ప్రకాష్‌రావు పాల్గొన్నారు.

➡️