ఆశల 36 గంటల ధర్నా విజయవంతం

ప్రజాశక్తి – భీమవరం, భీమవరం రూరల్‌

ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆశాలు కలెక్టరేట్‌ వద్ద గురు, శుక్రవారాల్లో చేపట్టిన 36 గంటల ధర్నా విజయవంతమైంది. ఈ ధర్నాకు జిల్లా నలుమూలల నుండి ఆశాలు పెద్దసంఖ్యలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా ప్రాంగణానికి చేరుకున్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గురువారం రాత్రి బహిరంగ ప్రదేశంలో ఒకపక్క దోమలు, మరోపక్క చలిని సైతం లెక్క చేయకుండా ధర్నా శిబిరంలోనే బస చేశారు. ఉదయం అల్పాహారం అనంతరం తమ ధర్నా ప్రారంభించి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా రారు మాట్లాడుతూ ఆశాలు విధి నిర్వహణలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రూ.26 వేలు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ఆశాలకు వర్తింపజేయాలని, రూ.10 లక్షలు ఇన్సూరెన్స్‌ కల్పించాలని కోరారు. అనంతరం ఆశాలు కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి డిఎంహెచ్‌ఒకు వినతిపత్రం అందజేశారు. దీనిపై డిఎంహెచ్‌ఒ స్పందించి మాట్లాడుతూ ఆశాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు చింతపల్లి లక్ష్మి, ప్రధాన కార్యదర్శి దిగుపాటి జ్యోతి, నేతలు లారెన్స్‌ కుమారి, బేగం, ఆదిలక్ష్మి, దేవి, పద్మ, రాజేశ్వరి, స్రవంతి, దీపిక, రమాదేవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌, జిల్లా నేతలు బి.వాసుదేవరావు, పివి.ప్రతాప్‌, జవ్వాది శ్రీను, బి.కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.టిడిపి నేతల సంఘీభావం మూడు నెలల్లో టిడిపి ప్రభుత్వం వస్తుందని, తమ ప్రభుత్వం రాగానే ఆశాలు, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఆశాల ధర్నా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నేతలు గంటా త్రిమూర్తులు, వి.రాఘవులు, బి.చంద్రమోహన్‌ పాల్గొన్నారు.

➡️