ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలి

9, 10వ తేదీల్లో 36 గంటల ధర్నా

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

ఉద్యోగ, ఉపాధ్యాయుల రూ.18 వేల 96 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ దశలవారీ పోరాటంలో భాగంగా ఈ నెల 9, 10వ తేదీల్లో రాష్ట్ర కేంద్రంలో జరిగే 36 గంటల ధర్నాను విజయవంతం చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉండగా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒకటో తేదీనే జీతాలు, మెరుగైన పిఆర్‌సి, టైం టు టైం డిఎ ఇస్తానని, సిపిఎస్‌ రద్దుచేసి ఒపిఎస్‌ అమలు చేస్తానని అనేక వరాల జల్లులు కురిపించారని తెలిపారు. ఎన్నికై ఐదేళ్లు పూర్తికావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేరకపోగా పదో తేదీ దాటితే గాని జీతాలు రాని పరిస్థితి ఉందన్నారు. ఐదేళ్లలో ఉద్యోగులు దాచుకున్న వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బాకీ పడిందన్నారు. అనేక పోరాటాలు చేస్తే 2023 సెప్టెంబర్‌లో బాకీలు తీరుస్తానని స్పష్టమైన హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ బాకీలను వెంటనే విడుదల చేయాలని, ఇప్పటికే ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశామన్నారు. ఈ దశలవారీ పోరాటంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యకలాపాల రిపోర్టును యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎకెవి.రామభద్రం ప్రవేశపెట్టారు. సమావేశానికి జిల్లా అధ్యక్షులు పిఎస్‌.విజయరామరాజు అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ధర్నాలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.మార్కండేయులు, యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి సిహెచ్‌.పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు పి.శివప్రసాద్‌ జి.లక్ష్మీనారాయణ, పి.క్రాంతికుమార్‌, జి.రామకృష్ణంరాజు, కె.శ్రీరామకృష్ణ ప్రసాద్‌, ఎం.శ్రీనుబాబు, కెఎస్‌సిహెచ్‌.సాయిరాం, సిహెచ్‌ కుమార్‌ బాబ్జి పాల్గొన్నారు.

➡️