ఎడతెరిపిలేని వర్షం.. తీరని నష్టం

Dec 5,2023 21:42

   మిచౌంగ్‌ తుపాన్‌ వరి రైతుకు నష్టం మిగిల్చింది. పలుచోట్ల వరి చేలు నీటమునిగాయి. ధాన్యపు రాశులు తడిచిపోయాయి. ఈదురుగాలులకు వరి చేలు నేలకొరిగాయి. రోడ్లు జలమమం అయ్యాయి. పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 ప్రజాశక్తి – ఆకివీడు
మిచౌంగ్‌ తుపాన్‌ వరి రైతును నిండా ముంచింది. మండలంలో సుమారు నాలుగు వేల ఎకరాలు వరి ఊడ్పు సాగింది. మొత్తం నూరు శాతం పంట నీట మునిగింది. పంట చేలల్లో, బోదెల్లో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఆకివీడు లంక దిగువనున్న పొలాలు మొత్తం నీటమునిగాయి. మరికొన్ని చోట్ల నీళ్లలో వరి పనలు తేలుతున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పనికి రాకుండా పోతాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల ప్రభావంతో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షం కారణంగా సోమవారం సాయంత్రం నుంచి నామమాత్రంగానే కరెంటు ఉంది. వైర్లు ఎక్కడికక్కడ వాలిపోవడంతో నిరంతరంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. స్థానికంగా పలు పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌ అందక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కొన్నిచోట్ల ట్యాంకుల్లోకి నీళ్లు వెళ్లిపోయి ఈ సమస్య ఏర్పడింది. నిలిచిపోయిన గూడ్స్‌ రైలుఆకివీడు నుంచి సిద్దాపురం వెళ్లే రోడ్డులో ఉన్న రైల్వే గేట్‌ వద్ద మంగళవారం సాయంత్రం గూడ్స్‌ రైలు కొంతసేపు నిలిచిపోయింది. సుమారు అర కిలోమీటర్‌పైబడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వర్షం ప్రభావంతో సిగల్స్‌ పడకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని రైల్వే సిబ్బంది చెబుతున్నారు.నీట మునిగిన నివాస ప్రాంతాలుపట్టణంలోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానిక శాంతినగర్‌లో రెండు అడుగుల నీరు నిలిచిపోయింది. నివాస ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. పల్లం కాని రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయులు కాకర్ల రాజరాజేశ్వరి ఇంట్లోకి నీరు ప్రవేశించింది. జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఆట స్థలం మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. జాతీయ రహదారి వెంబడి అడుగు పైన నీరు నిలబడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆకివీడు మండలంలో 3813 ఎకరాలు, కాళ్లలో 3868, ఉండిలో 10,791 ఎకరాలు మొత్తం 18,472 ఎకరాలు వరి పంట సాగు అయిందని వ్యవసాయ శాఖ ఎడి శ్రీనివాస్‌ తెలిపారు. వాటిలో 2,783 ఎకరాలు వరి పడిపోయిందని, మరో 1430 ఎకరాల్లో వరి నీట మునిగిందని చెప్పారు. ఆచంట :మిచౌంగ్‌ తుపాన్‌ రైతులను తీవ్రంగా దెబ్బ తీసింది. ఆచంట మండలంలో ఇప్పటివరకు 500 ఎకరాలు మాత్రమే కోతలు కొయ్యగా మరో 9,900 ఎకరాలు కోత కోయాల్సి ఉందని మండల విస్తరణాధికారి బి.నాగరాజు తెలిపారు. మండలంలో నాట్లు ఆలస్యంగా వేయడం వల్ల నవంబర్‌ నాలుగో వారం నుంచి కోతలు ప్రారంభించారని, ఈ తరహాలో డిసెంబర్‌ నెలలో పూర్తిస్థాయిలో పంట చేతికొచ్చిన సమయంలో అధిక వర్షాలు, తుపాన్లు, ఈదురుగాలుల కారణంగా రైతులు పంట నష్టపోతున్నారన్నారు. ఆచంట మండలంలో అత్యధికంగా 116 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిస్తే పంట నష్టం ఎక్కువగా ఉంటుందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలు జలమలమయ్యాయి. తుపాన్‌ ప్రభావం వల్ల మండలంలోని పెదమల్లంలో మంగళవారం సాయంత్రం భారీ ఎత్తున సుడిగాలి సంభవించడంతో ఆర్‌అండ్‌బి రహదారి పక్కన ఉన్న పెద్ద రావిచెట్టు విద్యుత్‌ తీగలపై పడి నేలకొరిగింది. స్థానికులు, అధికారులు స్పందించి రహదారిపై పడి ఉన్న రావిచెట్టును తొలగించారు. సుమారు మూడు గంటల పాటు విద్యుత్‌ అధికారులు శ్రమించి విద్యుత్‌ను పునరుద్ధరించారు. కాళ్ల : తుపాను ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షానికి ఎక్కడికక్కడ వరిచేలు, ధాన్యం రాశులు తడిసిపోయాయి. మండలంలో 3,878 ఎకరాల్లో సార్వా సాగవుతోంది. ఇప్పటివరకు మండలంలో పలు గ్రామాల్లో 600 ఎకరాల్లో వరి కోతలయ్యాయి. రెండు వేల ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట రెండు రోజులుగా వర్షానికి తడిసింది. వెయ్యి ఎకరాల్లో వరి కంకులు బరువెక్కి వరి మొదలు పట్టు కోల్పోవడంతో వరిచేలు వర్షాలకు, ఈదురు గాలులకు నేలకొరిగాయి. పడిపోయిన వరి చేల పైకి వర్షపు నీరు చేరడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులకు పంటను గట్టుకు చేర్చుకునే తరుణంలో భారీ వర్షాలు కురవడంతో తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉండి : ఉండి మండల వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురవడంతో పల్లపు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. డ్రెయినేజీలు నిండిపోయి నీరు రోడ్లపైకి రావడంతో దుర్గంధం వెదజల్లుతుందని స్థానికులు వాపోతున్నారు. ఉండి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం నీట మునిగింది. రహదారి మొత్తం నీటితో నిండిపోయి బుధవారం పాఠశాలకు విద్యార్థులు వెళ్లేందుకు వీలు లేకుండా ఉంది. వర్షం వస్తే క్రీడా ప్రాంగణం నీట మునుగుతుందని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను జులై 19వ తేదీన సందర్శించిన జెడ్‌పి చైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ దృష్టికి పాఠశాల ఉపాధ్యాయులు తీసుకువెళ్లగా క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని ఆమె హామీ ఇచ్చి ఐదు నెలలు కావాస్తున్నా ఇప్పటివరకు దానిపై చర్యలు లేవని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకొల్లు : పాలకొల్లులో రోడ్లు చెరువులను తలపించాయి. హౌసింగ్‌ బోర్డు కాలనీతో పాటు పలు కాలనీలు నీట మునిగాయి. బస్టాండ్‌ నీటిలో మునిగి ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. రోడ్లపై జనసంచారం లేకపోవడంతో పలు షాపులు మూసివేశారు. దీంతో ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.తణుకు : తుపాన్‌ నేపథ్యంలో తణుకులో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రెయినేజీలు పొంగి వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు చలిగాలులు వీస్తున్నాయి. ఇళ్ల లోంచి బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.మొగల్తూరు : నియోజకవర్గంలోని గ్రామాలు సాగునీటి కాలువలకు శివారున, మురుగు కాలువలు, ఉప్పుటేరులకు ముఖద్వారంలో ఉన్నాయి. గత వేసవి అనంతరం కాలువలకు నీటిని విడుదల చేసిన చాలా రోజుల వరకూ శివారుప్రాంతాలకు నీరు చేరలేదు. దీంతో సార్వాసాగులో నారుమడులు, నాట్లు వేయడానికి జాప్యం జరిగింది. సాగులోనూ నీటిఎద్దడి వేధించింది. వీటన్నిటి ప్రభావంతో ఈ ఏడాది దిగుబడులు గణనీయంగా తగ్గేఅవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. వరిచేల మాసూళ్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షానికి ఎగువనుంచి వచ్చే ముంపునీరు, సముద్రపోటుతో ఉప్పుటేరులు పోటెత్తి చేలు నీటమునిగే ప్రమాదం ఉంది. దీంతో పంట చేతికందేవరకూ ఆందోళన తప్పదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.442 ఎకరాల్లో మాసుళ్లుమొగల్తూరు మండలంలోని 789 ఎకరాలకు 112 ఎకరాల్లో మాసుళ్లు పూర్తి చేశారు. 189 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. నరసాపురం మండలంలోని 6059 ఎకరాలకు 330 ఎకరాలో ్లమాసుళ్లు పూర్తి చేశారు. 529 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు.రైతులు ఆందోళన చెందొద్దుఅనిల్‌కుమారి, నరసాపురం ఎడిఎవరి చేల్లో నిలిచిన నీటిని బయటకు వెళ్లేలా బోదెలు ఏర్పాటు, నేలవాలిన వరిదుబ్బులను సరిచేసేందుకు ఉపాధి హామీ చట్టం కూలీలను వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అనుమతిచ్చారు. వర్షం తగ్గుముఖం పట్టిన అనంతరం తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. రైతులు అందుబాటులో ఉన్న వాహనంలో ధాన్యం రవాణా చేసే వెసులుబాటు కల్పించారు.రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలు కురవడంతో వర్షపునీరు బయటకు వెళ్లే మార్గం లేదు. దీంతో రహదారులపైనే వర్షపు నీరు నిలిచిపోయి చెరువులను తలపించాయి. ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. మండలంలోని పలు గ్రామాల్లోని కాలనీలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. మొగల్తూరులోని కొండవారిపాలెంలో జగనన్న కాలనీ పేరుపాలెం సౌత్‌లోని లైన్‌ పలవపాలంలోని కాలనీ, లక్కవరపు వారికాలనీలు జలదిగ్బంధనం అయ్యాయి. దీంతో ఆయా కాలనీలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామాలయం సెంటర్‌ సమీప ప్రాంతంలో చెట్టుకొమ్మ విరిగి రహదారిపై పడింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోతే ప్రమాదం తప్పింది. వాహన రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు ఆ చెట్టుకొమ్మను తొలగించి ట్రాఫిక్‌ని పునరుద్ధరించారు.కాళ్ల : మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు జలమయం అయ్యాయి. మండల కేంద్రమైన కాళ్లలో రాష్ట్ర రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. ప్రధాన రహదారులు, పలు కాలనీలు జలమయమయ్యాయి. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళక రోడ్లపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. తాడేపల్లిగూడెం : మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. కూలి పనులు చేసుకునేవాళ్లు ఇళ్లకే పరిమితమయ్యాయరు. హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఆర్‌టిసి ప్రాంగణం, కడకట్ల, మహాలక్ష్మి నగర్‌, శేషుమహల్‌ రోడ్డు, మున్సిపల్‌ కార్యాలయం రోడ్డు, ట్యాక్సీ స్టాండు రోడ్లు నీట మునిగాయి. డ్రెయిన్లు పొంగి మురుగునీరు రోడ్లపైకి చేరింది. యలమంచిలి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల,ు ఈదురు గాలులకు మండలంలోని గుంపర్రు, చింతదిబ్బ ఇలపకుర్రు, కట్టుపాలెం, మేడపాడు, పెనుమర్రు, నేరేడుమిల్లి గ్రామాల్లోని వరిచేలు నేలకొరిగాయి. దీంతో చేలల్లోని నీటిని రైతులు బయటకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

➡️