కొనసాగిన మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులపై నిర్బంధాన్ని విడనాడి వారి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం మున్సిపల్‌ కార్మికుల సమ్మె రెండో రోజు బుధవారం కొనసాగింది. ఈ మేరకు పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులు పనిముట్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి గోపాలన్‌ మాట్లాడారు. జగన్మోహన్‌ రెడ్డి మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ధరలు, మరోపక్క చాలీచాలని జీతాలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్‌ కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. వారికి కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో సిఐటియు, ఎఐసిటియు నాయకులు బి.వాసుదేవరావు, ధనాల నాని, కె.సంటిబాబు, నీలాపు రాజు, ఎస్‌కె.నాగూర్‌ విశ్వనాథం పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం రెండో రోజుకు చేరింది. సమ్మెకు మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు హాజరై మాట్లాడారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రానున్న కాలంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రెండో రోజు సమ్మెలో భాగంగా మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌.సతీష్‌, ధనాల రాజు, టి.భాను, కె.దయామణి, ధనరాజు నాయకత్వం వహించారు.తణుకురూరల్‌ : మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ కార్మికులు సమ్మెను కొనసాగిస్తారని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెండో రోజు రాష్ట్రపతి రోడ్డులో మున్సిపల్‌ కార్యాలయం వద్ద నుంచి నరేంద్ర సెంటర్‌ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌, యూనియన్‌ గౌరవాధ్యక్షులు కామన మునిస్వామి మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నీలాపు ఆదినారాయణ, అజ్జి కృష్ణబాబు, ఎం.మందులయ్య, ఆదిలక్ష్మీ పాల్గొన్నారు.

➡️